Anasuya Bharadwaj vs Shivaji : హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన వాడిన పదజాలంపై చిన్మయి, అనసూయ భరద్వాజ్ సహా పలువురు సెలబ్రిటీలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా అనసూయ సోషల్ మీడియాలో వరుస పోస్టులతో శివాజీని ప్రశ్నిస్తూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంలో తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. శివాజీ పదాలు తప్పైనా, ఉద్దేశం తప్పుకాదని వారు వ్యాఖ్యానించారు.
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారానికే దారి తీశాయి. ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి, నటి అనసూయ భరద్వాజ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు బహిరంగంగానే శివాజీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అనసూయ ఈ అంశాన్ని గట్టిగా తీసుకుని సోషల్ మీడియా వేదికగా శివాజీని ప్రశ్నిస్తూ వరుస పోస్టులు పెట్టింది. ఒక మహిళగా తన వస్త్రధారణపై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు నిన్న చీరలోనూ, బికినీలోనూ ఉన్న తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ‘ఇది నా ఎంపిక’ అంటూ పరోక్షంగా విమర్శకులను రెచ్చగొట్టిన తీరు మరింత చర్చకు దారి తీసింది. మరోవైపు అనసూయ వైఖరిపై కరాటే కళ్యాణి, శేఖర్ బాషా లాంటి వారు కూడా విమర్శల వర్షం కురిపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పినా దీనిపై చర్చ మాత్రం ఆగలేదు. అసభ్య పదజాలం వాడటం తప్పేనని చాలా మంది ఒప్పుకుంటున్నప్పటికీ, ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశాన్ని పూర్తిగా తప్పుబట్టాలా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో ఈ వివాదంలోకి బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి , ఆమె భర్త, రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇవ్వడంతో విషయం మరో మలుపు తిరిగింది. ఒక ఇంటర్వ్యూలో దివ్వెల మాధురి మాట్లాడుతూ… శివాజీ వాడిన పదాలు తప్పేనని అంగీకరిస్తూనే, ఆయన వెనుక ఉన్న ఆలోచనను మాత్రం పూర్తిగా తప్పు అనలేమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే శివాజీ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఈ అంశాన్ని లాగుతూ అనసూయ అతిగా స్పందిస్తోందని ఆమె విమర్శించారు. స్త్రీకి సంప్రదాయ వస్త్రాల్లోనే అసలైన అందం ఉంటుందని, నేటి తరం హీరోయిన్లు మితిమీరిన దుస్తులు ధరించడం సమాజంపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. అనసూయ తన శరీరం తన ఇష్టం అంటూ ఈ వయసులోనూ బికీనీలు వేసుకోవడం తనకు నచ్చదని, ఈ విషయంలో తనని ఎంత ట్రోలింగ్ చేసుకున్నా వెనక్కి తగ్గేదే లేదని మాధురి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి.
ఈ చర్చలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్ కూడా శివాజీకి మద్దతుగా మాట్లాడారు. హీరోయిన్లు వేసుకునే దుస్తుల విషయంలో పూర్తి బాధ్యత నటీమణులపై కాకుండా, దర్శకులు, నిర్మాతలపై కూడా ఉందన్నారు. సినిమా కథ, పాత్ర డిమాండ్ మేరకే దుస్తులు నిర్ణయిస్తారని, కాబట్టి మార్పు రావాలంటే మేకర్స్ ఆలోచన విధానంలో మార్పు అవసరమని సూచించారు. ఈ సమాజంలో వస్త్రధారణ బట్టే మహిళపై గౌరవం ఆధారపడి ఉంటుందని కుండబద్దలు కొట్టశారు.
ఈ మొత్తం వివాదం సోషల్ మీడియాను రెండు వర్గాలుగా చీల్చింది. ఒక వర్గం అనసూయ వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తే, మరో వర్గం శివాజీ మాటల్లోని ఉద్దేశాన్ని సమర్థిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాధారణ మహిళల నుంచి శివాజీకి మద్దతు పెరుగుతోంది. ‘పదజాలం తప్పు అయినా, చెప్పాలనుకున్న విషయం నిజమే’ అంటూ పలువురు మహిళలు పోస్టులు పెట్టడం గమనార్హం. మొత్తానికి, హీరోయిన్ల వస్త్రధారణపై మొదలైన ఈ రగడ… ఇప్పుడు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, సామాన్య మహిళల అభిప్రాయాలతో మరింత పెద్ద చర్చగా మారింది. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.
