Krishna : బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు.. హాజరైన కుటుంబ సభ్యులు..

కృష్ణ జ్ఞాపకార్థం బుర్రిపాలెం గ్రామంలో నేడు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించగా కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 05:30 PM IST

సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) గత సంవత్సరం మరణించిన సంగతి తెలిసిందే. బుర్రిపాలెం(Burripalem) అనే ఓ చిన్న గ్రామం నుంచి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో సినిమాలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నారు. కృష్ణ మరణం ఆయన కుటుంబానితో పాటు బుర్రిపాలెం గ్రామస్థులకు కూడా తీరని లోటు ఏర్పడింది. కృష్ణ జ్ఞాపకార్థం బుర్రిపాలెం గ్రామంలో నేడు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించగా కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఉన్న బుర్రిపాలెం గ్రామంలో నేడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని కృష్ణ కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో సుదీర్ బాబు(Sudheer Babu) దంపతులు, కృష్ణ కూతుర్లు మంజుల, పద్మావతి, దర్శకుడు కృష్ణా రెడ్డి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మరియు పలువురు కుటుంబ సభ్యులు, మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్, మాజి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణ అభిమానులు భారీగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ కూతురు మంజుల మాట్లాడుతూ.. కృష్ణ గారు బుర్రిపాలెం బుల్లోడుగా కోట్లాది మంది ప్రేక్షకుల ప్రేమను పొందారు. నాన్నగారికి బుర్రిపాలెం అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఆయన మాకు అనేకసార్లు చెప్పేవారు. అభిమానులతో కలిసి బుర్రపాలెంలో కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ఆశయాలు సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మాపై ఉంది. ఎప్పుడైనా నేను బాధలో ఉనప్పుడు కృష్ణ గారి చిత్ర పటాన్ని చూస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కృష్ణ గారి విగ్రహాన్ని చూస్తే ఆయన ఇక్కడే సజీవంగా ఉన్నట్లు ఉంది అని అన్నారు.

కృష్ణ కూతురు పద్మావతి మాట్లాడుతూ.. రైతు కుటుంబంలో పుట్టి ఇంత ఎదగటం తమకు గర్వకారణం. నాన్నగారి ఆశయాలతో ముందుకు వెళ్తాం. కృష్ణ గారికి గ్రామంపై ఎంతో ప్రేమ ఉంది ఆయనకు గ్రామంపై ఎనలేని మక్కువ ఉంది. ప్రతిసారి గ్రామంలో చిన్ననాటి జ్ఞాపకాలను తమతో నెమరవేసుకుంటూ ఉండేవారు అని అన్నారు.

కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. కృష్ణ బుర్రిపాలెం పేరు ఎత్తకుండా మాట్లాడరు. మహేష్ బాబు వర్క్ బిజీలో ఉండి రాలేకపోయారు. మరో సారి మహేష్ బాబు గ్రామానికి వస్తానన్నారు. గ్రామంలో మహేష్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక ముందు కూడా కొనసాగిస్తాము. గ్రామానికి ఏది కావాలన్నా తమ దృష్టికి తెస్తే తమ కుటుంబం తరుపున చేస్తాము. కృష్ణ పేరు గుర్తు ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమం రాబోయే రోజుల్లో చేపడతాము అని అన్నారు. కృష్ణ మరణించాక మొదటిసారి కృష్ణ స్వస్థలంలో ఆయన విగ్రహం పెట్టడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Kokapet Lands : క్లిన్ కార పేరు బలం..అప్పుడే చిరంజీవి ఫ్యామిలీకి 2000 కోట్ల లాభం