Site icon HashtagU Telugu

Krishna : గాలివానలో స్టేజిపై కృష్ణ పర్ఫార్మెన్స్..

Super Star Krishna goves Stage Performance in Full Rain

Super Star Krishna goves Stage Performance in Full Rain

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మండలి వెంకట కృష్ణారావు మంత్రిగా ఉన్న టైములో ‘ప్రపంచ తెలుగు మహాసభల’ను(Prapancha Telugu Mahasabhalu) మొట్టమొదటిసారిగా నిర్వహించారు. 1972-73లో మండలి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభలకు అప్పటి తెలుగు నటీనటులందరూ సహకరించారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, తెనాలి తదితర ప్రధాన పట్టణాల్లో నాటికలు, నాట్యాలు, సంగీతం, మిమిక్రీలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే సంగీత కచేరి బాలసుబ్రమణ్యం ఇస్తే, రాజసులోచన తన నాట్యంతో రంజింపజేశారు. వేణుమాధవ్‌ మిమిక్రీతో నవ్వించారు. ఇక నటీనటులు ఒక్కో నాటకంలో నటిస్తూ అలరించారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో అప్పలాచార్య రచించిన ‘వింత మనుషులు’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో పాత్రలు ఎక్కువ ఉంటాయి. కృష్ణ,(Krishna) విజయనిర్మల, చంద్రమోహన్‌, గుమ్మడి, జగ్గారావు, రాధాకుమారి, లీలారాణి, సాక్షి రంగారావు, రావికొండలరావు.. వంటి అగ్ర తారలే నటించారు.

ఇక ఈ ప్రదర్శన కోసం భారీ స్టేజిని ఏర్పాటు చేశారు. ఇక నాటకం మొదలు పెట్టిన తరువాత విపరీతమైన గాలి మొదలైంది. దీంతో ప్రదర్శన స్థలం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పై కప్పు లేచిపోయింది. ఆ తరువాత మెల్లిగా చినుకులు మొదలయ్యాయి. అయితే హీరో కృష్ణ ఆడియన్స్ తో ఓ మాట అన్నారట.

“మీరు చూస్తాను అంటే. మేము ఈ వానలోనే ప్రదర్శన ఇస్తాము” అని చెప్పారు. దానికి ప్రేక్షకులు.. చూస్తాము, చూస్తాము అని బదులిచ్చారు. ఇక ఆ వానలోనే స్టేజి పై తారలంతా నాటకం ప్రదర్శిస్తుంటే.. కింద ఆడియన్స్ కూర్చోవాల్సిన కుర్చీలను చేతితో నెత్తి పై పట్టుకొని వాన నుంచి తమని తాము కాపాడుకుంటూ నాటకం చూడసాగారు. అయితే విపరీతమైన గాలితో వాన తీవ్రంగా మారడంతో.. ప్రేక్షకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో నాటకాన్ని ఆపేసి కృష్ణతో పాటు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.