సుమతీ శతకం మూవీ రివ్యూ

Sumathi Satakam  సీరియల్ యాక్టరా.. వద్దురా బాబూ ప్రతిరోజూ టీవీలో చూసి చూసి బోర్ కొట్టేసింది.. ఇక థియేటర్‌కి వెళ్లి కూడా వాళ్ల ముఖాలు చూస్తారా? ఇలాంటి డైలాగులు సీరియల్ నటీనటులకి కొత్తేం కాదు. అయినా కానీ వెండితెరపై ఉన్న మమకారంతో తమని తాము నిరూపించుకోవాలనే తపనతో సినిమాల వైపు పరుగులు తీస్తుంటారు. అలా బుల్లితెరపై స్టార్లుగా ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది సినిమాల కోసం ఉన్న ఫేమ్‌ని కూడా త్యాగం చేసి బుల్లితెర నుంచి వెండితెరకి […]

Published By: HashtagU Telugu Desk
Amardeep Sumathi Satakam Movie Review

Amardeep Sumathi Satakam Movie Review

Sumathi Satakam  సీరియల్ యాక్టరా.. వద్దురా బాబూ ప్రతిరోజూ టీవీలో చూసి చూసి బోర్ కొట్టేసింది.. ఇక థియేటర్‌కి వెళ్లి కూడా వాళ్ల ముఖాలు చూస్తారా? ఇలాంటి డైలాగులు సీరియల్ నటీనటులకి కొత్తేం కాదు. అయినా కానీ వెండితెరపై ఉన్న మమకారంతో తమని తాము నిరూపించుకోవాలనే తపనతో సినిమాల వైపు పరుగులు తీస్తుంటారు. అలా బుల్లితెరపై స్టార్లుగా ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది సినిమాల కోసం ఉన్న ఫేమ్‌ని కూడా త్యాగం చేసి బుల్లితెర నుంచి వెండితెరకి వెళ్లారు.

అయితే అందులో సక్సెస్ అయిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అయినా కానీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం అవకాశాల కోసం చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా ఎన్నో అవమానాల్ని ఎదుర్కొని మొత్తానికి ‘సుమతీ శతకం’తో హీరోగా తన పేరుని సిల్వర్ స్క్రీన్‌పై చూసుకున్నాడు అమర్‌దీప్. మరి ఈ సినిమా ఆడియన్స్‌కి కనెక్ట్ అయిందా? అసలు సినిమా కథేంటి.. ఎలా ఉందో చూద్దాం.

పెళ్లి కోసం తపిస్తూ
తూర్పుగోదావరిలోని వైకుంఠపురానికి చెందిన కృష్ణకి (అమర్‌దీప్) చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే చాలా ఇష్టం. ఊరిలో జరిగే ప్రతి పెళ్లిలోకి వెళ్లి నాకు పెళ్లి చేయండ్రా బాబూ అంటూ తెగ గోల చేస్తూ ఉంటాడు. అయితే పెద్దయిన తర్వాత ఊరిలో అందరికీ పెళ్లిళ్లు అవుతాయి కానీ కృష్ణకి మాత్రం ఏ సంబంధం సెట్టు కాదు. దీంతో ఒక జ్యోతిష్యుడ్ని కలిస్తే నీకు దేవత లాంటి అమ్మాయి భార్యగా వస్తుందని చెప్తాడు.

అలా తన దేవతని వెతుక్కునే క్రమంలో పక్క ఊరిలోని అంగన్‌వాడీ టీచర్ సుమతీ (సైలీ చౌదరి)ని తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు కృష్ణ. అయితే ఆ అమ్మాయి కూడా కృష్ణని కొన్నాళ్లకి ఇష్టపడుతుంది. కానీ తనని పెళ్లి చేసుకోవాలంటే ధైర్యం కావాలి.. ఒకసారి శుక్రవారం మా ఊరికి రా అని పిలుస్తుంది. చాలా కాన్ఫిడెన్స్‌గా శుక్రవారం వాళ్ల ఊరెళ్లిన కృష్ణకి ఊహించని షాక్ తగులుతుంది.

సుమతీ గురించి ఒక విషయం తెలుస్తుంది. అది చూడగానే సుమతీపైన ఉన్న ప్రేమ కాస్తా భయంగా మారుతుంది. అసలు కృష్ణ ఆరోజు ఏం చూశాడు? తనలోని ప్రేమ భయంగా మారడానికి కారణమేంటి? ఇంతకీ చివరికి సుమతీ-కృష్ణల పెళ్లి జరిగిందా లేదా అనేదే మిగిలిన కథ.

కామెడీ ఉంది కానీ
సుమతీ శతకం ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో వర్కవుట్ అయ్యేలా ఉందే అనే ఫీలింగ్ కలిగింది. కానీ థియేటర్లో మాత్రం ఆడియన్స్‌ని ఈ సినిమా నిరాశపరిచింది. సినిమా మొత్తం అమర్.. తన అసిస్టెంట్ టేస్టీ తేజ మధ్య నడిచే కామెడీ ట్రాక్ చాలా ఎక్కువే ఉంది. కానీ ఇది ఎక్కడా వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా టేస్టీ తేజ కామెడీ చేస్తున్నాననే ఫీలింగ్‌తో వేసిన ప్రతి డైలాగ్‌ ఓవరాక్షన్‌లా, సాగదీసినట్లుగా అనిపించింది.

ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా అలా అలా నాలుగు కామెడీ సీన్లతో సాగుతుంది. ఊరి ప్రెసిడెంట్‌ బుల్లిరాజుగా మహేష్ విట్టా కాస్త నవ్వించాడు. లేదంటే సినిమా ఇంకా చప్పగా సాగి ఉండేది. సినిమాలో అమర్‌ కనిపించిన తీరు, ఆహార్యం, యాక్టింగ్ అన్నీ తన ఫేవరెట్ హీరో రవితేజని ప్రతిబింబిచేలానే ఉంటాయి. ఎక్కడా అమర్ తన మార్క్ చూపించినట్లు కనిపించలేదు. అయితే ఇది తెలిసి చేశాడని అనుకోలేం. ఎందుకంటే అమర్‌కి రవితేజ అంటే ప్రాణం. సో తెలీకుండానే ఆ చూపులు, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్నీ దింపేశాడు.

బేసిక్‌గా మంచి డ్యాన్సర్ అయిన అమర్ ఇందులో తన టాలెంట్ చూపించాడు. కానీ కథ, కథనంలో పెద్దగా సంఘర్షణ లేకపోవడం, కామెడీ పూర్తి స్థాయిలో పండకపోవడంతో అమర్ ప్రయత్నం సఫలం కాలేదు. ఇక సినిమాకి మరో డ్రా బ్యాక్ హీరోయిన్ సైలీ. లవ్ స్టోరీ వరకూ ఆమె యాక్టింగ్ ఓకే కానీ దేవత ఆవహించినప్పుడు ఆమె నటన మాత్రం తేలిపోయింది. అసలు ఎక్కడా కూడా సైలీని అమ్మవారిగా చూడలేకపోతారు ఆడియన్స్.

సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం విషయంలో మాత్రం మార్కులు వేయొచ్చు. సాంగ్స్ అన్నీ కూడా చాలా ప్లజెంట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా చిట్టి చిట్టి సుమతీ సాంగ్ థియేటర్లో కూడా బావుంది. అయితే కథ, కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బావుండేది. ఎందుకంటే చూసిన ఆడియన్స్‌కి సుమతీ శతకం సీరియల్‌కి ఎక్కువ సినిమాకి తక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే అమర్ ఖచ్చితంగా హీరో మెటీరియల్‌యే కానీ సినిమాలో మాత్రం మ్యాటర్ లేదు

 

 

  Last Updated: 06 Feb 2026, 04:12 PM IST