జైపూర్ లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బాలీవుడ్ స్టార్ లు అయిన షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు ప్రచారం చేసిన పాన్ మసాలా యాడ్ మోసపూరితంగా ఉందని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని, ఆరోగ్యానికి హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నారనే కారణంగా, జైపూర్ కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ యాడ్‌లో దానె దానె మే కెసర్ కా దమ్ అనే ట్యాగ్‌లైన్ ఉపయోగించారు.
కానీ నిజానికి ఈ ఉత్పత్తిలో అసలు కేశర్ కలిపి ఉండదని ఆరోపించారు. మార్కెట్ లో కేశర్ ధర లక్షల్లో ఉంటుంది. కానీ అంత విలువైనది రూ.5 ల పాన్ మసాలాలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీంతో జనాల్లో మోసం జరుగుతోందని, తప్పుడు ప్రచారం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని కోర్టుకు వివరించారు. ఈ కేసులో కేవలం నటులనే కాదు, వాణిజ్య సంస్థ జేబీ ఇండస్ట్రీస్ అధినేత విమల్ కుమార్ అగర్వాల్ కు సైతం నోటీసులు వెళ్లాయి. న్యాయస్థానం ముద్దాయిలు అందరికీ మార్చి 19న హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే వారు లేకుండానే విచారణ కొనసాగించబడుతుందని స్పష్టం చేసింది.
నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నటులు, కంపెనీకి కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కేసు పై ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదట. అయితే, ఫేమస్ సెలెబ్రిటీల ప్రమోషన్లతో జనాలు తప్పుదారి పడుతున్నారని, తప్పుడు ప్రచారానికి బాధ్యత వహించాలని న్యాయవాది బడియాల్ డిమాండ్ చేస్తున్నారట. ఈ ప్రకటనను తక్షణమే బ్యాన్ చేయాలని, వీరు చేసిన తప్పుడు ప్రచారానికి జరిమానా విధించాలని కోర్టును కోరారట. మరి నటులు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.