దివంగత అక్కినేని నాగేశ్వరరావు (ANR) హీరోగా నటించిన తొలి సినిమా ‘శ్రీ సీతారామ జననం’ (Sri Seeta Rama Jananam)విడుదలై నేటికి 80 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది. ’80 వసంతాల శ్రీ సీతారామ జననం. అత్యంత పిన్న వయస్కుడైన తొలి కథానాయకుడు. మొదటి చిత్రంతోనే శ్రీరాముడి పాత్ర ధరించారు. ఈ చిత్రంలో పద్యాలు సొంతగా పాడుకున్నారు’ అని పోస్టర్లో క్యాప్షన్ ఇచ్చారు. 1944 డిసెంబర్ 1వ తేదీన విడుదలైన ‘శ్రీ సీతారామ జననం’ చిత్రం నేటితో (2024 డిసెంబర్ 1) 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, త్రిపురసుందరి, వేమూరి గగ్గయ్య, రుష్యేంద్రమణి ప్రధాన పాత్రలలో నటించారు. సంగీతం ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావు సంయుక్తంగా స్వరపరిచారు. హీరోగా ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకూ కోరస్ గాయకుడిగా ఘంటసాలకూ ఇది తొలి చిత్రం.
అక్కినేని బాల నటుడిగా నటించిన, నటుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘ధర్మపత్ని’. ఆ చిత్రంలో బాల నటుడిగా కనిపించినా అక్కినేని చలనచిత్ర జీవితం ప్రారంభమైంది, కొనసాగింది మాత్రం ‘శ్రీ సీతారామ జననం’ చిత్రంతోనే అని చెప్పాలి. ఈ సినిమాలో అక్కినేనికి ఎలా అవకాశం వచ్చిందంటే.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో యథాలాపంగా చూసిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య.. అక్కినేని భవిష్యత్‌ను ముందుగానే ఊహించారో ఏమో తెలియదు కానీ.. తను తీస్తున్న ‘శ్రీ సీతారామ జననం’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. విశేషం ఏమిటంటే.. తొలి చిత్రంలోనే శ్రీరాముని పాత్ర పోషించే అవకాశం రావడం నిజంగా అక్కినేని చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. అప్పటివరకు హీరోలుగా నటించిన వారి వయసు 30కి పైనే. కానీ చాలా చిన్న వయసులోనే కథానాయకుడిగా అవకాశం పొందిన తొలి నటుడు మాత్రం అక్కినేని నాగేశ్వరరావే. ఇందులో సీతగా నటించిన త్రిపుర సుందరి అక్కినేని తొలి కథానాయికగా సినిమా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. ఈ సినిమాలో రావణుడిగా, పరశురాముడిగా వేమూరి గగ్గయ్య, లక్ష్మణుడిగా బిఎన్ రాజు, విశ్వామిత్రుడిగా బలిజే పల్లి లక్ష్మి కాంతం, కైకగా కమలా కొట్నిస్ నటించారు. వీరందరూ వయసులోనూ, అనుభవంలోనూ అక్కినేని కంటే పెద్ద వారే. అలాంటి అనుభవజ్ఞులు పక్కన ఉన్నా కూడా.. ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
Read Also : TDP : అభిమాని ఆత్మహత్య.. మంత్రి లోకేష్ ఎమోషనల్ పోస్ట్