Site icon HashtagU Telugu

Sirivennela : జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది!

Sri

Sri

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మరణవార్త నుంచి కోలుకోముందే.. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి తుదిశ్వాస విడవడం సినీ అభిమానులకు తీవ్రంగా కలిచివేస్తోంది. కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధితవ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. డాక్టర్లు ఆయన ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. సీతారామశాస్త్రి ఊపిరి ఆగిపోయింది.

1986లో గేయ రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆయన సాహిత్యం అందించిన తొలి చిత్రం ‘సిరివెన్నెల’. అందులో అన్ని పాటలు రాసింది ఆయనే! ‘సిరివెన్నెల’ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా అవార్డు అందుకున్నారు. ఆయన కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించారు. సాహిత్యరంగానికి ఆయన చేసిన సేవలకుగానూ 2019లో పద్మశ్రీ వరించింది.

జననీ జన్మభూమి సినిమాకు గేయ రచయితగా అరంగేట్రం చేసినప్పటికీ, కే.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల మూవీలో పాటలకుగాను సిరివెన్నెలగా తన పేరును స్థిరపర్చుకున్నారు. ఆది భిక్షువు” పాటకు ఉత్తమ గీత రచయితగా శాస్త్రి తన మొదటి నంది అవార్డును అందుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. బూడదిచ్చే వాడి నేటి అడిగేది అన్నా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అన్న పాటకు విశేష ఆదరణ లభించింది. పదినంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సాధించారు.

♦చెంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్‌.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు.

♦పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు.

♦కాకినాడలో ఇంటర్మీడియట్‌, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు.

♦ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

♦సిరి వెన్నెల సీతారామశాస్త్రి మొత్తం 11సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు.

♦ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అందుకున్నారు.

♦800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు రాశారు.

అరుదైన పద సంపద

‘‘నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు ఎమై పోని
మారదు లోకం మారదు కాలం..’’
“కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తు
నాతో నేనె రమిస్తూ”
‘‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..ఓం..
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం..ఓం..
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్..
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం.’’

ప్రముఖుల నివాళి

సిరివెన్నల మరణవార్త తో టాలీవుడ్ శోకసంద్రంలోకి వెళ్లింది. ఆయన మరణవార్తను విని జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది పాటల దిగ్గజం బాలుగారు కన్నుమూయకపోముందే.. సిరివెన్నెల చనిపోవడం ఎంతగానో బాధిస్తుంది. సిరివెన్నెలతో అనుబంధం గుర్తుచేసుకుంటూ ప్రముఖులు, నటులు నివాళులు అర్పించారు.

 

Exit mobile version