రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ వేడుక కు వచ్చి తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. కాకినాడ-రాజమండ్రి ఏడీబీ రోడ్డు మరమ్మతుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల (Shyamala) తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేయడమే కాకుండా, ఈ ప్రమాదాన్ని రాజకీయరంగంలోకి లాగడాన్ని విమర్శించారు.
“కాకినాడ-రాజమండ్రి ఏడీబీ రోడ్డు ఛిద్రమైన స్థితిలో ఉందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్ కు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు సర్? సీజ్ ద రోడ్ (SEIZE THE ROAD) అనాలి కదా! సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా? మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా?… అంటే, మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా?” అంటూ శ్యామల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోవడం కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేసింది. రోడ్డు సమస్యలపై తగు చర్యలు తీసుకోవడంలో పాలకులు వైఫల్యం చెందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Bangladesh : షేక్ హసీనాపై బంగ్లాదేశ్ రెండో అరెస్టు వారెంట్ జారీ