తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) నేడు ఒక్కసారిగా స్తంభించిపోయింది. అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల భారీ రెమ్యునరేషన్ల కారణంగా నిర్మాతలు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తమిళ చిత్ర నిర్మాతల మండలి (TFPC) నేడు (మే 2, 2026) టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చింది. గత మూడేళ్లుగా నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని, ఒక్క సినిమా ఫెయిల్ అయినా నిర్మాతలు కోలుకోలేని స్థితికి చేరుకుంటున్నారని మండలి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నిరసనలో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా సినిమాల షూటింగ్లతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిలిచిపోయాయి.
ఫిక్స్‌డ్ శాలరీ వద్దు.. ప్రాఫిట్ షేరింగ్ ముద్దు!
నిర్మాతల మండలి ప్రధానంగా ‘రెవెన్యూ షేరింగ్’ (Revenue Sharing) నమూనాను తెరపైకి తెచ్చింది. నటీనటులు ముందే భారీ మొత్తంలో ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నిర్మాతలే నష్టపోతున్నారని వారు వాదిస్తున్నారు. దీనికి బదులుగా, బాలీవుడ్ మరియు టాలీవుడ్‌లోని కొందరు అగ్ర హీరోలు అనుసరిస్తున్నట్లుగా.. సినిమా లాభనష్టాల్లో నటీనటులు భాగస్వాములు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే, సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకోవాలని, దీనివల్ల నిర్మాణ భారం తగ్గుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు నడిగర్ సంగం (నటీనటుల సంఘం) కు ప్రతిపాదనలు పంపినా, సరైన స్పందన రాకపోవడంతోనే ఈ సమ్మెకు దిగినట్లు సమాచారం.
సమస్య తేలకపోతే నిరవధిక సమ్మె
కేవలం రెమ్యునరేషన్లే కాకుండా, ఓటీటీ విడుదల గ్యాప్‌పై కూడా నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద సినిమాలకు కనీసం 8 వారాల థియేటర్ విండో ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఒక రోజు టోకెన్ సమ్మె కేవలం హెచ్చరిక మాత్రమేనని, నడిగర్ సంగం చర్చలకు రాకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని టీఎఫ్‌పీసీ హెచ్చరించింది. మే 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విషయంపై మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే వేసవి కానుకగా విడుదల కావాల్సిన పలు భారీ చిత్రాల విడుదల తేదీలు మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఈ ‘రెవెన్యూ షేర్’ అంశం పెద్ద చర్చకు దారితీసింది.
