ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్(Posani Arrest)పై నటుడు శివాజీ(Shivaji) స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు పోసానిని అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ తన సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయకూడదని, అది రాజకీయాల్లో అనుసరించాల్సిన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
Anchor : డిప్రెషన్లోకి స్టార్ యాంకర్..కారణం వారేనట!
తాను 12 ఏళ్ల పాటు రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే సందర్భంలో ఆయా వ్యక్తుల కుటుంబాన్ని జోలికెళ్లడం అసలు సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఆదేశాల మేరకు విమర్శలు చేయవచ్చు, కానీ వ్యక్తిగత స్థాయికి వెళ్లకూడదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలకు కూడా ఒక హద్దు ఉండాలని, దానిని అందరూ గౌరవించాలని శివాజీ సూచించారు.
పోసాని కృష్ణమురళి వ్యవహారంపై తన అభిప్రాయం వెల్లడించిన శివాజీ.. ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పోసాని తన తప్పును గ్రహించేందుకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క్షణికావేశంలో ఎవరైనా తప్పు చేయవచ్చని, అయితే అలాంటి సందర్భాల్లో కఠినంగా వ్యవహరించకుండా, సరి చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ప్రస్తుతం కోర్టు పోసానికి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.