Sharwanand’s Bhogi : ఒకప్పుడు వరుస పరాజయాలతో సతమతమైన శర్వానంద్, ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా, శర్వానంద్‌కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ బేస్‌ను మరోసారి నిరూపించింది. ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న ఆయన, మార్చి 3న విడుదల కానున్న ‘బైకర్’ సినిమాతో హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
‘భోగి’తో హై వోల్టేజ్ యాక్షన్ – 1960ల నాటి కథ
శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. 1960వ దశకంలో ఉత్తర తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన యథార్థ గాథల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఉగ్ర రూపంలో, మాస్ యాక్షన్ మోడ్‌లో కనిపించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
కేవలం ‘బైకర్’, ‘భోగి’ చిత్రాలే కాకుండా, శర్వానంద్ తన లైనప్‌ను చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. మాస్ డైరెక్టర్ శ్రీను వైట్లతో చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. అంటే, ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది వరకు శర్వా నుంచి వరుసగా మూడు నాలుగు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తన ఇమేజ్‌ను కేవలం లవర్ బాయ్‌కే పరిమితం చేయకుండా, ‘భోగి’ వంటి చిత్రాలతో మాస్ హీరోగా కూడా ఎదగాలని శర్వానంద్ చేస్తున్న ప్రయత్నం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
