మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వస్తున్నాడు అంటే అభిమానులు ఎంత ఉత్సాహపడతారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అభిమానులకు కొంత టచ్ లో ఉంటున్నారు. కానీ ఒక్కప్పుడు ఒక స్టార్ ని చూడాలంటే.. అయితే షూటింగ్‌లో లేదంటే ఏదైనా ఈవెంట్ సమయంలో మాత్రమే. కాగా ఒకసారి పద్మాలయా స్టూడియోలో షూటింగ్ చూడడానికి కొంతమంది ప్రేక్షకులు వచ్చారు. ఆ సమయంలో శరత్ బాబుకి (Sarath Babu) సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇక ఆ షూటింగ్ పూర్తి అయ్యి శరత్ బాబుతో పాటు ఆడియన్స్ కూడా బయలుదేరుతున్న సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఆ టెలిఫోన్ సంభాషణ ఏంటంటే.. “టికెట్స్ కన్ఫార్మ్ అయ్యాయి కదా. సరే నువ్వు అక్కడే ఎయిర్ పోర్ట్ లో ఉండు. శరత్‌బాబు గారు డైరెక్ట్ అక్కడికే వచ్చేస్తారు. అలాగే చిరంజీవి గారిని కూడా అక్కడికే తీసుకు వచ్చేయండి”. ఈ సంభాషణను కొందరు ప్రేక్షకులు విన్నారు. ఇంకేముంది ఎయిర్ పోర్ట్ కి వెళ్తే చిరంజీవిని చూడవచ్చు అని అభిమానులంతా ఎయిర్ పోర్ట్ కి పరుగులు పెట్టారు. ఇక అక్కడ చిరంజీవి కోసం ఎంతో ఎదురు చూశారు. శరత్ బాబు కూడా వచ్చేశారు. ఫ్లైట్ వెళ్లిపోయే సమయం కూడా అయ్యింది. కానీ చిరంజీవి మాత్రం రావడం లేదు.
విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయం దగ్గర పడడంతో కొందరు అభిమానులు ఆత్రుత పట్టలేక శరత్ బాబు దగ్గరికి వెళ్లి అడిగారు. “సార్ ఇందాక ఫోన్ లో మీ పేరుతో పాటు చిరంజీవి గారు పేరు కూడా విన్నాము ఎయిర్ పోర్ట్ కి వస్తున్నారని. ఆయన ఎక్కడ సార్” అని అడిగారట. దానికి శరత్ బాబు గట్టిగా నవ్వారట. “ఫోన్ కాల్ లో మీరు విన్నది కరెక్టే. అయితే చిరంజీవి అంటే మీరు అన్నకున్న వ్యక్తి కాదు. నా మేకప్ మెన్ పేరు కూడా చిరంజీవే” అని శరత్ బాబు చెప్పడంతో అభిమానుల ఆశల మీద నీరుపోసినట్లు అయ్యింది. ఈ విషయాన్ని శరత్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక శరత్ బాబు ఇటీవల మే నెలలో అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.