Actress Suhasini: వివాదంలో సీనియర్ నటి సుహాసిని

అసలే దక్షిణాది రాష్ట్రాలన్నీ హిందీ భాషపై అప్రకటిత యుద్ధం చేస్తుంటే.. సీనియర్ నటి సుహాసిని మాత్రం హిందీ భాష మంచిదని.. హిందీ మాట్లాడేవారు మంచివాళ్లంటూ పొగిడారు.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 11:15 PM IST

అసలే దక్షిణాది రాష్ట్రాలన్నీ హిందీ భాషపై అప్రకటిత యుద్ధం చేస్తుంటే.. సీనియర్ నటి సుహాసిని మాత్రం హిందీ భాష మంచిదని.. హిందీ మాట్లాడేవారు మంచివాళ్లంటూ పొగిడారు. హిందీవారితో మాట్లాడాలంటే ఆ భాష నేర్చుకోవాలన్నారు. పనిలో పనిగా తమిళులు కూడా మంచివారని చెప్పేశారు. అక్కడితో ఆగితే వివాదం పెద్దగా ఉండేది కాదు. కానీ అసలు హిందీ అంటేనే అగ్గిమీద గుగ్గిలమయ్యే తమిళులను హిందీ నేర్చుకోమని సలహా ఇవ్వడం, వారు హిందీ నేర్చుకుంటే సంతోషమేనని చెప్పడంతో ఆమెపై విమర్శల యుద్ధం మొదలైంది.

తన ప్రసంగం చివర్లో మాత్రం అన్ని భాషలూ మంచివేనని, ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత మేలని చెప్పుకొచ్చారు. కానీ ఈ మాటలు కన్నా.. హిందీ భాష మంచిదని.. తమిళులు కూడా హిందీ నేర్చుకోవాలన్న వ్యాఖ్యలు పై ఇప్పటికే ఆమెపై విమర్శలు మొదలయ్యాయి. తమిళగడ్డపై హిందీ భాషపై వ్యతిరేకత ఇప్పటిది కాదు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే కూడా హిందీకి వ్యతిరేకంగా పోరాటం
చేస్తోంది.

సుహాసినీ ఇలా మాట్లాడడానికి కారణం.. ఆమె భర్త మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమా హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. భారీ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. అయితే హిందీ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి, ప్యాన్ ఇండియా సినిమాగా దానిని నిలబెట్టడం కోసమే సుహాసిని అలా హిందీకి అనుకూలంగా మాట్లాడారన్న అభిప్రాయం లేకపోలేదు. కానీ ఇది తమిళనాట ఆమెకు వ్యతిరేక పవనాలు వీచేలా చేస్తుందా.. పొన్నియన్ సెల్వన్ సినిమా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.