Site icon HashtagU Telugu

Bhanumathi – Savitri : సావిత్రి, భానుమతి చుట్టూ.. ఉత్తమ నటి వివాదం..

Savitri and Bhanumathi Issue on Best Actress

Savitri and Bhanumathi Issue on Best Actress

భానుమతి(Bhanumathi), సావిత్రి(Savitri) తెలుగుతెరపై ఎంతటి గుర్తింపుని సంపాదించుకున్నారో తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు నటీమణులు హీరోలను సైతం డామినేట్ చేసినవారే. ఈ ఇద్దరికీ ఒకరి నటనతో మరొకరికి పోలిక పెట్టలేము. అయితే ఒక సమయంలో అలా పోలిక పెట్టే సందర్భం వచ్చింది. వీరిద్దరూ నటించిన సినిమాలు అవార్డుల రేసులో నిలిచాయి. అప్పుడు ఉత్తమ నటిగా ఎవర్ని ఎంపిక చేయాలని న్యాయనిర్ణేతలకు పెద్ద సమస్యే వచ్చింది. ఆ సమస్యతో వారు ఇచ్చిన ఫలితం వివాదానికి దారి తీసింది. అసలు అప్పుడు ఏం జరిగింది..?

తెలుగు పరిశ్రమ కూడా మద్రాసులోనే ఉన్న రోజులవి. ఆ సమయంలో ‘ఫిల్మ్ ‌ఫ్యాన్స్‌ అసోసియేషన్‌’ అనే సంఘానికి మంచి పేరు ఉంది. ఈ అసోసియేషన్‌ తమిళ్, తెలుగు సినిమాలకు అవార్డులను ప్రకటించేవారు. ప్రతి ఏడాది ఇచ్చే ఈ అవార్డులను నటీనటులు, టెక్నీషియన్స్ చాలా గౌరవంగా భావించేవారు. ఇక 1953లో సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలకు కూడా అవార్డులు ప్రకటిస్తున్న సమయంలో పోటీలో ‘చండీరాణి’ (chandirani), ‘దేవదాసు’ (Devadasu) సినిమాలు కూడా ఉన్నాయి.

దేవదాసు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏఎన్నార్, సావిత్రి కలయికలో తెరకెక్కిన ఈ సినిమా క్లాసిక్ గా నిలిచింది. సినిమాలో ఏఎన్నార్, సావిత్రిల నటన కూడా అద్భుతం. ఇక చండీరాణి విషయానికి వస్తే.. ఈ సినిమాని భానుమతినే డైరెక్ట్ చేశారు. ఎస్వీఆర్, ఎన్టీఆర్, భానుమతి ప్రధాన పాత్రల్లో నటించారు. తానే రచించి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో భానుమతి కూడా అద్భుతంగా నటించారు. ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు తమిళంలో కూడా సేమ్ నటీనటులతో రిలీజ్ అయ్యాయి.

ఇక అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమనటి అవార్డు ఇచ్చే సమయంలో.. తెలుగులో ఉత్తమనటిగా భానుమతికి, తమిళంలో ఉత్తమనటిగా సావిత్రికి అవార్డుని ఇచ్చారు. ఇలా ఇవ్వడమే అప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. తెలుగు చండీరాణి అయినా తమిళ చండీరాణి అయినా నటించింది భానుమతే కదా.. అప్పుడు తమిళంలో కూడా ఆమెకే అవార్డు ఇవ్వాలి కదా..? అలాగే సావిత్రికి కూడా తెలుగులో కూడా అవార్డు వచ్చి ఉండాలి కదా..? అంటూ ఆడియన్స్, పాత్రికేయులు ప్రశ్నించారు.

టాలెంట్ కి పురస్కారం అని చెప్పి అవార్డులను అర్థంలేకుండా పంచుతున్నారా..? అనే ప్రశ్నలతో పాటు విమర్శలు ఎదురయ్యాయి. కానీ న్యాయనిర్ణేతలు మాత్రం వీటికి సమాధానం చెప్పలేదు. ఇక అవార్డుల ప్రధానోత్సవంలో సావిత్రి వచ్చి పురస్కారం అందుకున్నారు గాని, భానుమతి అవార్డు వేడుకకు రాలేదు. ఈ వివాదం వల్లే ఆమె ఆ అవార్డుని అందుకోలేదని అప్పుడు వార్తలు వచ్చాయి.

 

Also Read : Karthikeya : విజయ్‌ దేవరకొండ చేయాల్సిన సినిమా.. కార్తికేయ అందుకొని హిట్..