Site icon HashtagU Telugu

Sarkaru Vaari Paata Review: మహేశ్ ‘మాస్’ ఎంటర్‌టైనర్

Sarkari

Sarkari

చిత్రం: సర్కారు వారి పాట
రేటింగ్: 2.75/5
తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు
సంగీతం: ఎస్ థమన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్
విడుదల తేదీ: మే 12, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా విడుదలై దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. అటు ఆయన ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అప్పుడు ‘సరిలేరు నీకెవరూ’ ప్రేక్షకులకు ముందుకొచ్చిన మహేశ్ తాజాగా సర్కారు వారి పాటతో సిద్ధమయ్యాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హైప్ ను క్రియేట్ చేసింది. పోకిరీ తర్వాత ఆ స్థాయి సినిమా అవుతుందని చిత్ర యూనిట్ సైతం వెల్లడించింది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించారు. అంతేకాకుండా వెన్నెల కిషోర్, సముద్రఖని తదితరులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇంతకీ సర్కారు వారి పాట ఎలా ఉందంటే..

కథ:

మహేష్ అలియాస్ మహి(మహేష్ బాబు) అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. డబ్బు కి ఎక్కువ విలువ ఇస్తాడు. త‌న ద‌గ్గ‌ర నుంచి ప్రేమ, అభిమానాన్ని దొంగిలించిన బాధ‌ప‌డ‌డు కానీ డ‌బ్బు దొంగిలిస్తే సహించలేడు. అప్పు తీసుకున్న‌వాడు ఎంత దూరంలో ఉన్నా తిరిగి వ‌సూలు చేసుకుంటాడు. ఇండియా నుంచి అమెరికాకు చ‌దువు కోసం వ‌చ్చిన క‌ళావ‌తికి(కీర్తిసురేష్) క్యాసినో పిచ్చి. మ‌హేష్‌కు అబ‌ద్దాలు చెప్పి అత‌డి ద‌గ్గ‌ర అప్పు తీసుకొని జూదం ఆడుతుంది. తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ అప్పు వ‌సూలు చేసుకోవ‌డానికి మ‌హేష్ వైజాగ్‌లోని క‌ళావతి తండ్రి రాజేంద్ర‌నాథ్(సముద్రఖని) ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. రాజేంద్ర‌నాథ్ త‌న‌కు ప‌దివేల కోట్లు బాకీ ఉన్నాడ‌ని మీడియా ముందు ప్ర‌క‌టిస్తాడు మ‌హేష్‌. అత‌డు అలా ఎందుకు అన్నాడు? రాజేంద్ర‌నాథ్‌తో మ‌హేష్ కు ఉన్న వైరం ఏమిటి? ఆ ప‌దివేల కోట్లు ఎక్క‌డివి? మ‌హేష్ వైజాగ్ రావ‌డానికి కార‌ణ‌మేమిటి? అత‌డి మంచిత‌నాన్ని క‌ళావ‌తి అర్థం చేసుకుందా? లేదా అన్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

మహేశ్ నటన నెక్ట్స్ లెవల్

ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పైగా తన లుక్ కూడా బాగా అదిరిపోయింది.ఇక మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలో తన అందంతో, తన కామెడీ టైమింగ్ తో, తన నటనతో మరోసారి ఫిదా చేసింది.ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ తో బాగా నవ్వించాడు.విలన్ గా సముద్రఖని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

లాజిక్స్ మిస్సింగ్..

ధ‌నిక వ‌ర్గాల రుణాల ఎగ‌వేత అనే చిన్న‌పాయింట్ ను తీసుకొని దానిచుట్టూ క‌మ‌ర్షియ‌ల్ హంగులు అల్లుకొని ప‌ర‌శురామ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. కానీ ఈ అంశాన్ని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించలేకపోయారు. రాజేంద్ర‌నాథ్‌ను మ‌హేష్ టార్గెట్ చేయ‌డానికి ప్ర‌ధాన‌మైన కార‌ణం క‌న్వీన్సింగ్‌గా లేదు. మ‌హేష్, స‌ముద్ర‌ఖ‌ని ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు వ‌ర్క‌వుట్ కాలేదు. విల‌న్ క్యారెక్ట‌రైజేష‌న్‌ను స‌రిగా రాసుకోలేదు. ప్ర‌థ‌మార్థం మొత్తం టైమ్‌పాస్ వ్య‌వ‌హారంగానే సాగుతుంది త‌ప్పితే క‌థ‌తో ఎలాంటి సంబంధం ఉండ‌దు. సెకండాఫ్ మొత్తం స్లోగా సాగినట్లు ఉంది.

హైలైట్స్

దాదాపు రెండున్నరేళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో తెరపై మహేశ్ చూసేందుకు ఆయన అభిమానులు ఉత్సాహం చూపారు. కొన్ని అంశాలు పోకిరి సినిమాలా ఉండటంతో అభిమానులు ఫుల్ కుష్ అయ్యారు. అయితే స‌ర్కారువారి పాట కచ్చితంగా మ‌హేష్ అభిమానుల‌ను మెప్పిస్తుంది. మ‌హేష్ బాబు కామెడీ టైమింగ్‌ను ఇష్ట‌ప‌డేవారు ఎంజాయ్ చేస్తారు. అభిమానులకు అయితే స్పెషల్ మూవీ ఇది.