బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పతి పత్ని ఔర్ వో దో’ ఇటీవల మే 15న విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. నేటితరం ప్రేమకథలు, ఆధునిక వైవాహిక బంధాల్లో ఎదురయ్యే ఆచరణాత్మక సమస్యలను ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా చూపించడంతో ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ పెళ్లి బంధంపై తనకునన్న ప్రాక్టికల్ ఆలోచనలను, తన వ్యక్తిగత అభిప్రాయాలను ఎంతో ఓపెన్‌గా పంచుకున్నారు.
తన వ్యక్తిగత జీవితంలో, చుట్టుపక్కల కొన్ని పెళ్లి బంధాలు విఫలమై విడిపోవడాన్ని కళ్లారా చూసిన సారా, వివాహం అనే వ్యవస్థను కేవలం ఊహల్లో చూసి తేలిపోనని స్పష్టం చేశారు. మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ చూసే సంఘటనల నుంచే మన ఆలోచనలు పుడతాయని పేర్కొంటూ, హడావుడిగా పెళ్లి చేసుకుని బాధపడే కంటే కాస్త సమయం తీసుకుని సరైన వ్యక్తి దొరికే వరకు వేచి చూడటం ఎంతో ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకవేళ తన జీవితంలోకి సరైన భాగస్వామి దొరకకపోతే, ఎవరికోసం తనను తాను మార్చుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమేనని సారా తెగేసి చెప్పారు.
నన్ను ఎవరో వచ్చి సంపూర్ణురాలిగా చేయాల్సిన అవసరం లేదని, ఒక సంపూర్ణమైన మనిషిగా సొంతంగా ఎదగడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని సారా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనకంటూ ఉన్న ప్రత్యేక గుర్తింపును గౌరవిస్తూ, తన సంతోషాన్ని పంచుకునే వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెబుతూ, ప్రస్తుతానికి మాత్రం తన పూర్తి దృష్టి కేవలం కెరీర్, సొంత ఎదుగుదల, సినిమాలపైనే ఉందని ఆమె క్లారిటీ ఇచ్చారు.
