Sankranthi 2026: సంక్రాంతి (Sankranthi 2026) పండుగ సీజన్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక పెద్ద పండుగ. ఎప్పుడూ భారీ వసూళ్లను అందించే ఈ సీజన్‌ను 2026లో కూడా సినీ నిర్మాతలు గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకొని తమ సినిమాలను వరుసగా ప్రకటిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 7 చిత్రాలు సంక్రాంతి 2026 బరిలో నిలిచాయి. వీటిలో ఐదు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు కాగా, రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.
స్టార్ హీరోల మధ్య పోరు
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మధ్య పోటీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
మెగాస్టార్ చిరంజీవి – ‘మన శంకర వర ప్రసాద్ గారు’: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి సరసన నయనతార నటిస్తున్నారు. సినిమా ప్రారంభంలోనే మేకర్స్ సంక్రాంతి విడుదలను ధృవీకరించారు. పండుగకు సరిపోయే అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ప్రభాస్ – ‘ది రాజా సాబ్’: మొదటిసారి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మేకర్స్ ఈ సినిమాను జనవరి 9, 2026న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Also Read: PM Kisan Yojana: ఖాతాల్లోకి రేపే రూ. 2000.. ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు!
మాస్, కామెడీ జోనర్ల సందడి
మాస్ మహారాజా రవితేజ, యువ హీరో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ కూడా ఈ పండుగ రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రవితేజ – ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’: కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తోంది.
నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’: నాగ వంశీ నిర్మిస్తున్న ఈ కామెడీ డ్రామాపై మంచి అంచనాలు ఉన్నాయి.
శర్వానంద్ – ‘నారి నారి నడుమ మురారి’: ఈ భారీ పోటీ మధ్య రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిలదొక్కుకోవాలంటే బలమైన కంటెంట్ అవసరం.
దళపతి విజయ్, శివకార్తికేయన్ డబ్బింగ్ చిత్రాలు
సంక్రాంతి బరిలో రెండు పెద్ద డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి.
దళపతి విజయ్ – ‘జన నాయగన్/ జన నాయకుడు’: హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ఈ చిత్రం కూడా జనవరి 9, 2026న విడుదల కానుండటంతో ప్రభాస్ ‘ది రాజా సాబ్’తో నేరుగా తలపడనుంది. విజయ్ చివరి సినిమాగా ప్రచారం అవుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
శివకార్తికేయన్ – ‘పరాశక్తి’: సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ ద్విభాషా చిత్రం జనవరి 14, 2026న విడుదల కానుంది. మొత్తం ఏడు చిత్రాలతో 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో అత్యంత రద్దీగా, ఉత్కంఠభరితంగా మారనుంది. కొన్ని చిత్రాల తేదీలు మారే అవకాశం ఉన్నప్పటికీ పండుగ వాతావరణం సినీ అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని అందించడం ఖాయం.
