Allu Arjun : నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట కేసులో బన్నీకి ఇప్పటికే షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అయితే ఆ షరతులలో తాజాగా నాంపల్లి కోర్టు కీలకమైన సడలింపులను మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలలోపు చిక్కడపల్లి పోలీసుల ఎదుట అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉంది. రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసే క్రమంలో కోర్టు ఈ షరతు పెట్టింది. ఇప్పుడు ఈవిషయంలో బన్నీకి మినహాయింపు కల్పిస్తున్నట్లు నాంపల్లి కోర్టు వెల్లడించింది.
Also Read :Live In Partner Murder : లివిన్ పార్ట్‌నర్ దారుణ హత్య.. 8 నెలలు ఫ్రిజ్‌లోనే డెడ్‌బాడీ
గత ఆదివారం రోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం చేసి వచ్చారు. ఆ సమయంలో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈనేపథ్యంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లడం వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం.. ప్రతి ఆదివారం పోలీసు స్టేషనుకు వెళ్లడం నుంచి బన్నీకి మినహాయింపు కల్పించింది. కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని సూచించింది.
Also Read :CM Yogi : ‘‘సీఎం యోగి తలను నరికేస్తా..’’ వివాదాస్పద ఫేస్‌బుక్ పోస్ట్ కలకలం
ఇటీవలే అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఈక్రమంలో వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ.50 వేలతో రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని ఆయనను ఆదేశించింది. డిసెంబర్ 5న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే శ్రీతేజను అల్లు అర్జున్(Allu Arjun) పరామర్శించారు. బాలుడికి కావాల్సిన వైద్య సదుపాయాన్ని అల్లు అర్జున్ కల్పించారు. రేవతి కుటుంబానికి పుష్ప2 చిత్ర యూనిట్ రూ. 2 కోట్ల సాయాన్ని ప్రకటించింది.