రాముడంటే ఎన్టీవోడే. కృష్ణుడన్నా ఎన్టీవోడే. ఇది అప్పట్లో ఎన్టీఆర్ కు దక్కిన క్రెడిట్. రాముడి పాత్రకు అచ్చంగా సరిపోయే పర్సనాల్టీ ఆయనది. అందుకే ఆ పాత్రలో ఆయనను తప్ప వేరేవారెవరినీ ఊహించుకోలేని పరిస్థితి. అలాంటి సమయంలో శ్రీరాముడిగా తెరపై కనిపించాడు శోభన్ బాబు. సంపూర్ణ రామాయణం సినిమాతో దర్శనమిచ్చాడు. ఇది బాపూరమణల దృశ్య కావ్యం. ఈ సినిమా తీసి నేటికి (మార్చి 16) 50 ఏళ్లు పూర్తయ్యాయి.
1963లో వచ్చిన ఎన్టీఆర్ లవకుశతోనే తెలుగులో రంగుల సినిమాలు మొదలయ్యాయి. అప్పట్లోనే ఇది కోటి రూపాయిలు వసూలు చేసింది. జనం ఊళ్ల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి మరీ చూసేవారు. అంటే అది ప్రజలకు ఎంత నచ్చిందో, శ్రీరాముడిగా ఎన్టీఆర్ వారి గుండెల్లో ఎలాంటి చెరగని ముద్ర వేసుకున్నారో వేరే చెప్పక్కరలేదు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ తో కాకుండా శోభన్ బాబును రాముడిగా చూపించి రామాయణం సినిమా తీయడం అంటే మాటలు కాదు. కానీ బాపూరమణలు ఆ సాహసాన్ని చేశారు. 1972 మార్చి 16న ఉగాది పండుగ నాడు సంపూర్ణ రామాయణం సినిమా వచ్చింది. టాలీవుడ్ లో ఔట్ డోర్ లో సెట్స్ వేసి తీసిన తొలి సినిమా కూడా ఇదే. అప్పట్లో సినిమాల బడ్జెట్ రూ.6-7 లక్షలే ఉండేది. కానీ ఈ సినిమాను రూ.17.34 లక్షలు ఖర్చుపెట్టి మరీ తీశారు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే ఎన్టీఆర్ ను కలిసి ఈ సినిమా తీద్దామనుకుంటున్నాం అని బాపూ చెప్పారు. కానీ తాను శ్రీరామ పట్టాభిషేకం సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నానని.. సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉందని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఆ సినిమా తీయడానికి కొంత టైమ్ పడుతుంది కదా.. ఈలోపే ఈ సినిమా తీసేస్తామని చెప్పడంతో ఎన్టీఆర్ ఓకే చెప్పారు.
ఈ సినిమాను కలర్ లో తీయడానికి బాపూరమణలు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో భారీ చిత్ర నిర్మాణ సంస్థలకు మాత్రమే కలర్ ఫిల్మ్ దొరికేది. బయటి మార్కెట్ లో లభించేది కాదు. అయినా దానిని కొనడానికి బడ్జెట్ ఎక్కువయ్యేది. కాకపోతే ఎల్వీప్రసాద్ కుమారుడు ఆనంద్ బాబు హెల్ప్ చేయడంతో చాలా కష్టపడి 75 కలర్ ఫిల్మ్ రోల్స్ ను సంపాదించగలిగారు. దాంతోనే సినిమా మొత్తాన్ని తీశారు బాపూరమణలు. సినిమా విడుదలకు ముందే ఎన్టీఆర్ ను కలిసి సినిమా గురించి చెప్పారు శోభన్ బాబు. ఎన్టీఆర్ ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాకపోతే శోభన్ బాబు రాముడేంటి.. ఆయనతో రామాయణం సినిమా ఏమిటి అని అప్పట్లో చాలామంది విమర్శించారు. దానికి తగ్గట్టే విడుదలైన తరువాత తొలి వారం కలెక్షన్లు బాగా తక్కువగా వచ్చాయి. ఆ బాధతో వారం రోజుల పాటు షూటింగ్స్ కు కూడా వెళ్లలేకపోయారు శోభన్ బాబు. కానీ తరువాత నెమ్మదిగా ప్రేక్షకులకు నచ్చడం మొదలైంది. దీంతో భారీ వసూళ్లతో దూసుకుపోయింది. 1973లో హిందీలో రిలీజ్ చేస్తే.. అక్కడ కూడా భారీ కలెక్షన్లను సాధించింది.