Green RRR: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు.

  • Written By:
  • Updated On - March 23, 2022 / 05:33 PM IST

‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, వారణాసి ప్రాంతాలను చుట్టేసిన ఈ టీం తాజాగా గ్రీన్ ఇండియాలో ఛాలెంజ్ లో పాల్గొంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్,  రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. బిజీ షెడ్యూల్ లోనూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ట్రిపుల్ ఆర్ టీమ్ ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.

ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలు అని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని డైరెక్టర్ రాజమౌళి తెలిపారు. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్  మరింత విజయవంతంగా కొనసాగాలని హీరో జూ.ఎన్టీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని  అన్నారు. ఈ భూమిపై అందరం అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే నాటి రక్షించాలి కోరారు.  తాను గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నాటానని, నాటిన ప్రతిసారి తెలియని సంతృప్తిని ఇస్తుందని హీరో రామ్ చరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ లు కరుణాకర్ రెడ్డి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.