Rahul Sipligunj: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆర్ఆర్ఆర్ సింగర్, గోషామహల్ నుంచి పోటీ?

ఇప్పటికే దిల్ రాజు, హీరో నితిన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - August 5, 2023 / 12:23 PM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ధనం బలమున్న నేతలనే కాకుండా జనాకర్షణ ఉన్న సెలబ్రిటీలను సైతం పోటీ చేయించాలని భావిస్తోంది. ఇప్పటికే దిల్ రాజు, హీరో నితిన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ సింగర్‌ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం.

బిగ్‌ బాస్ విన్నర్‌గా, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌గా పాపులరైన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇందు కోసం ముందుగానే పార్టీతో పాటుగా నియోజకవర్గం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ పైన అధికార ప్రకటనకు రాహుల్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మంగళహాట్ ప్రాంతానికి చెందిన రాహుల్ సిప్లిగంజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో  పోటీకి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక ఎన్నికల గెలుపుతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో ఈ సారి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అందులో భాగంగా రాహుల్ ముందుకు వస్తే గోషామహల్ నుంచి పార్టీ అభ్యర్దిగా అవకాశం కల్పించేలా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. గతంలో ఓ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన రాహుల్ సిప్లిగంజ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ కు బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి.

గోషామహల్ నుంచి ప్రస్తుతం సిట్టిగ్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి రాజా సింగ్ ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ పైన ఇంకా స్పష్టత రాలేదు. అదే సమయంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ సీటు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన అభ్యర్దిగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పోటీ పైన రాహుల్ తుది నిర్ణయ తీసుకోవాల్సి ఉంది. తన శ్రేయోభిలాషులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో, రాహుల్ ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read: TTD Chairman Race: టీటీడీ చైర్మన్ రేసులో కీలక నేతలు.. జగన్ వ్యూహత్మక అడుగులు