Site icon HashtagU Telugu

NTR Fans Meet : త్వరలో ఎన్టీఆర్ ఫాన్స్ మీట్.. ఫ్యాన్స్ ని చల్లబరిచేందుకే..

Reasons Behind NTR Fans Meet after Devara

Jr Ntr

NTR Fans Meet : తాజాగా నిన్న రాత్రి ఎన్టీఆర్ టీమ్ త్వరలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ ఉంటుందని ప్రకటించారు. దీంతో ఇంత సడెన్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ ఏంటో అని ఆలోచనలో పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. RRR తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో వచ్చాడు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. దేవర 500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకు, మీడియా ముందుకు వచ్చి చాలా కాలమే అయింది. RRR సమయంలో ఈవెంట్స్ తప్ప దేవరకు కూడా ఈవెంట్స్ ఏమి చేయలేదు.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ టీమ్ మీద కోపంగా ఉన్నారు. పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరకు ప్రమోషన్స్ చేయలేదని, ఎన్టీఆర్ ని కనీసం మీడియా ముందుకు తీసుకురాలేదని సోషల్ మీడియాలో దేవర టీమ్ ని, ఎన్టీఆర్ టీమ్ ని తిడుతూనే ఉన్నారు. పుష్ప ప్రమోషన్స్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత నిరాశకు గురయ్యారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో కూడా ఫ్యాన్స్ దేవర యూనిట్ పై ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ టీమ్ పై కూడా విమర్శలు చేసారు. దీంతో గత కొంత కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉండి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దానికి తోడు ఇటీవల బాలయ్య – ఎన్టీఆర్ ఫ్యాన్స్ విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలయ్య రెగ్యులర్ గా సినిమాలు, షోలు, పాలిటిక్స్, ఈవెంట్స్, ఇటీవల పద్మ భూషణ్ అవార్డు రావడం.. ఇలా ఏదో ఒక రకంగా మీడియా ముందు కనిపిస్తూ వైరల్ అవుతూనే ఉన్నారు. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీంతో ఎన్టీఆర్ కి – ఆయన ఫ్యాన్స్ కి మధ్య దూరం పెరిగిందని తెలుస్తుంది.

అందుకే ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కి మధ్య దూరాన్ని తగ్గిద్దామని, మరో సారి ఫ్యాన్స్ కి దగ్గరయి ఫ్యాన్స్ లో జోష్ నింపడానికి ఫ్యాన్స్ మీట్ పెట్టబోతున్నాడని టాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ టీమ్.. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు అని ప్రకటించారు.

దీంతో గత కొన్నాళ్లుగా నిరాశలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్ మీట్ పెట్టబోతున్నాడు అని ప్రకటించడంతో ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడు ఈ ఫ్యాన్స్ మీట్ పెడతారు, ఎలా కలవాలి, ఆ డీటెయిల్స్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

 

Also Read : Pawan Kalyan : ఈరోజు నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది టూర్.. వివరాలివీ