సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh) గతంలో సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్స్ చేసినందుకు మహేష్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇక ఈ కంపెనీ ప్రకటనల్లో మహేష్ బాబు కనిపించడం, వినియోగదారుల్లో నమ్మకాన్ని కలిగించింది. కానీ తాజాగా ఈ కంపెనీపై ఆర్థిక మోసాల ఆరోపణలు వచ్చాయి. దాంతో పాటు, మహేష్ బాబుపై కూడా వినియోగదారుల కోర్టు చర్యలు ప్రారంభమయ్యాయి. ఓ వినియోగదారు “మహేష్ బాబు చెప్పిన ప్రకటనలు చూసే ప్లాట్ బుక్ చేసుకొని మోసపోయారంటూ” అంటూ ఫిర్యాదు చేశాడు. దీనితో రంగా రెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం మహేష్ బాబుకు సమన్లు జారీ చేసింది.
ఇదివరకే ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించి సాయి సూర్య డెవలపర్స్‌పై దాడులు నిర్వహించింది. కంపెనీ అకౌంటింగ్ వివరాల్లో మహేష్ బాబుకు రూ. 3 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు నమోదు చేయడంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేష్ బాబు రెండు సార్లు ఈడీ నుండి నోటీసులు పొందారు. అయితే ఆయన స్వయంగా హాజరయ్యారా లేదా లాయర్ ద్వారా సమాధానం పంపించారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు వినియోగదారుల ఫోరంలో కూడా కేసు నమోదవడం, ఈ వ్యవహారాన్ని మరింత కీలకంగా మారుస్తోంది.
నిజానికి ప్రకటనల్లో కనిపించే ప్రముఖులకు నేరబాధ్యత లేదన్న చట్టబద్ధమైన అభిప్రాయం ఉంది. వినియోగదారులు తమ నిర్ణయాన్ని స్వయంగా తీసుకోవాల్సిందే. కానీ ప్రముఖులు తమ పేరు, బ్రాండ్ విలువతో ప్రమోట్ చేస్తున్న సంస్థలు నిజాయితీగా ఉన్నాయా లేదో పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా ఎన్నో దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు సెలబ్రిటీలకు హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే సెలబ్రిటీలు ప్రచారంలో ముందుండే ముందు ఆ సంస్థల నైతికతను పరిశీలించడం తప్పనిసరి.