Irumudi Ravi Teja Movie మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎమోషనల్ కథలకు పేరుగాంచిన దర్శకుడు శివ నిర్వాణతో ఆయన చేస్తున్న #RT77 చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప మాల ధరించి, తలపై ఇరుముడి పెట్టుకుని భజనలో నృత్యం చేస్తున్నట్లు కనిపించారు. ఆయన ఒక చేతిలో తన కుమార్తె (బేబీ నక్షత్ర)ను పట్టుకుని ఉండటం చూస్తుంటే, ఇది తండ్రీకూతుళ్ల మధ్య బలమైన అనుబంధంతో కూడిన కథ అని స్పష్టమవుతోంది.
-
- అయ్యప్ప మాలలో తండ్రీకూతుళ్ల బంధాన్ని చూపిస్తున్న పోస్టర్
- ‘ఇరుముడి’గా టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ విడుదల
- మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం
- రవితేజ కెరీర్‌లో భిన్నమైన ఎమోషనల్ డ్రామాగా రూపకల్పన
Some stories choose you at the right moment in life.
Feeling blessed to be part of one such story again, letting belief lead the way.🙏🏻
Excited to begin this new journey called #Irumudi with @ShivaNirvana & @MythriOfficial 🤗
Swamiye Saranam Ayyappa 🖤 pic.twitter.com/uXnquBzNIb
— Ravi Teja (@RaviTeja_offl) January 26, 2026
రవితేజ ఇప్పటివరకు చేసిన మాస్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని ఫస్ట్ లుక్‌తోనే దర్శకుడు శివ నిర్వాణ సంకేతమిచ్చారు. భక్తి, భావోద్వేగాల కలబోతగా ఈ కథను శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను పంచుకుంటూ రవితేజ ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు.
“కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి ఓ కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నమ్మకాన్ని ముందుంచి ‘ఇరుముడి’ అనే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. స్వామియే శరణం అయ్యప్ప” అని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
