Brahmastra@South: సౌత్ పై బాలీవుడ్ “బ్రహ్మాస్త్ర”!!

"కేజీఎఫ్2", "ఆర్ ఆర్ ఆర్", "పుష్ప" సినిమాల ధాటికి విలవిలలాడిన బాలీవుడ్ మళ్లీ కోలుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.

  • Written By:
  • Publish Date - June 2, 2022 / 10:00 PM IST

“కేజీఎఫ్2”, “ఆర్ ఆర్ ఆర్”, “పుష్ప” సినిమాల ధాటికి విలవిలలాడిన బాలీవుడ్ మళ్లీ కోలుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. దక్షిణాది సినీ నిర్మాణ సంస్థల మార్కెటింగ్ కిటుకులను వినియోగించి, త్వరలో విడుదల చేయబోయే సినిమాల్లో సక్సెస్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. బాలీవుడ్ కు పెట్టని కోటగా ఉన్న ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను దక్షిణాది సినిమాలు బద్దలు ఇప్పటికే బద్దలు కొట్టాయి. కేవలం విలక్షణమైన సినిమా కథ ద్వారా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. గత మూడు నెలల్లో RRR , KGF2 సినిమాలు చెరో రూ.1200 కోట్ల దాకా కలెక్షన్స్ చేశాయి. అయితే ఇదే సమయంలో బాలీవుడ్ లో ఒకే ఒక మూవీ “భూల్ భులయ్య 2” రూ.100 కోట్లకు మించి కలెక్షన్స్ చేయగలిగింది. దీన్నిబట్టి దక్షిణాది సినిమాల స్టోరీలు ఎంత బాగా జనాల్లోకి పోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

“బ్రహ్మాస్త్ర” పనిచేసేనా?

రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన “బ్రహ్మాస్త్ర” మూవీ సెప్టెంబర్ 9న విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి ఇప్పటి నుంచే దక్షిణాదిలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రణ్ బీర్. ఈక్రమంలోనే ఆయన ఇటీవల వైజాగ్ లో జరిగిన “బ్రహ్మాస్త్ర” మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా “RRR” మూవీ దర్శకుడు రాజమౌళిని ఆహ్వానించారు. ఇందుకు కారణం..దక్షిణాది సినీ మార్కెట్ లో రాజమౌళికి ఉన్న గ్రేట్ ఇమేజ్. రాజమౌళి ద్వారా దక్షిణాది ప్రజల్లోకి “బ్రహ్మాస్త్ర” మూవీని విస్తృతంగా తీసుకెళ్లాలని ఆ సినిమా నిర్మాణ యూనిట్ భావించి ఉండొచ్చు. ఈక్రమంలో పాన్ ఇండియా సినిమాల మార్కెటింగ్, పబ్లిసిటీ కిటుకులను కూడా బ్రహ్మాస్త్ర టీమ్ మన రాజమౌళి నుంచి తీసుకొని ఉండొచ్చు. “RRR” మూవీని దక్షిణాది లో ప్రమోట్ చేసేందుకు రాజమౌళి అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు “బ్రహ్మాస్త్ర” టీమ్ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ ఎన్ని ప్రణాళికలు వేసినా.. కథలో దమ్ము ఉండాలి. అది లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. కథ బాగా లేకుండా .. దక్షిణాది సినిమాల రికార్డులు బద్దలు కొట్టే లక్ష్యంతో ఎన్ని బ్రహ్మాస్త్రాలు సంధించినా తుస్సుమనే అవకాశాలు ఉంటాయి.