Rana Versatile: ఘనపాటి.. రానా దగ్గుబాటి!

మీరు బాహుబలి సినిమా చూశారా.. అందులో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది. ‘‘ఓ మంత్రివర్యా... భళ్లాలదేవను దెబ్బ కొట్టాలంటే ఒక దున్న కాదు.. పది దున్నలు కావాలి’’ అని అంటాడు బిజ్జలదేవ. ఆ ఒక్క డైలాగ్ భళ్లాలదేవ పాత్ర ఎంత శక్తివంతమైనదో ఇట్టే చాటిచెప్తుంది.

  • Written By:
  • Updated On - March 2, 2022 / 12:39 PM IST

మీరు బాహుబలి సినిమా చూశారా.. అందులో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది. ‘‘ఓ మంత్రివర్యా… భళ్లాలదేవను దెబ్బ కొట్టాలంటే ఒక దున్న కాదు.. పది దున్నలు కావాలి’’ అని అంటాడు బిజ్జలదేవ. ఆ ఒక్క డైలాగ్ భళ్లాలదేవ పాత్ర ఎంత శక్తివంతమైనదో ఇట్టే చాటిచెప్తుంది. ఏ సినిమాలోనైనా హీరో ఎలివేట్ కావాలంటే.. అంతకుమించి విలనిజం ఎలివేట్ కావాలి. అప్పుడే సినిమా రక్తికట్టిస్తుంది. ప్రేక్షులకులను కట్టిపడేస్తుంది. ‘‘భళ్లాలదేవ’’ లాంటి క్యారెక్టర్స్ మన డైరెక్టర్ల కళ్ల ముందు కదలాడినప్పుడు మొదటగా గుర్తుకువచ్చేది యంగ్ నటుడు రానా మాత్రమే. తాజాగా విడుదలైన ‘భీమ్లానాయక్’ లో రానా తన మార్క్ నటనను ఆవిష్కరించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా రానా తన ఉనికిని చాటుకుంటూ వర్సటైల్ యాక్టర్ అనిపించుకుంటున్నారు.

2009లో శేఖర్ కమ్ముల పొలిటికల్ థ్రిల్లర్ ‘లీడర్‌’ సినిమాతో రానా దగ్గుబాటి అరంగేట్రం చేసినప్పుడు.. తండ్రి, తాత పెద్ద నిర్మాతలు కాబట్టే ఈజీగా అవకాశం వచ్చిందని తేలిగ్గా కొట్టిపారేశారు. కానీ ఆ సినిమాలో యువ ముఖ్యమంత్రి పాత్రలో చాలా రిజర్వ్ గా, ఆరాధనీయంగా కనిపించాడు. పాత్ర డిమాండ్ మేరకు నటించాడే తప్ప.. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ కనిపించలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆ తర్వాత చిత్రాలతో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకులను ఆకర్షించడం కొనసాగించాడు. అతని కెరీర్ మొత్తంలో అద్భుతమైన చిత్రాలే కనిపిస్తాయి. ముఖ్యంగా 2017 నటుడిగా రానాకు చాలా విశేషమైనది. ‘ఘాజీ’లో అతను ఎప్పుడూ చనిపోయే నావికాదళ అధికారి పాత్రలో నటించాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌లో తన మాడ్యులేషన్‌పై అతను విపరీతమైన నియంత్రణను ప్రదర్శించాడు. అతను పాత్రలో చాలా కన్విన్స్‌ గా కనిపించాడు. రానాను రియల్ టైమ్ నేవల్ ఆఫీసర్ అని అనేంతగా నటించారంటే.. అతనికి నటన పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఇట్టే తెలిసిపోతోంది. ఇక బాహుబలిలో దుష్ట భల్లాల దేవ పాత్రలో ఇట్టే ఒదిగిపోయాడు. రానా ప్రభాస్‌కు తన పాత్రలో సమానంగా గట్టి పోటీని ఇచ్చాడు. మహేంద్ర బాహుబలిని చంపే సన్నివేశంలో రానా నటన నెక్ట్స్ లెవల్ అని చెప్పక తప్పదు.

ఆ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ లో కాజల్ అగర్వాల్‌తో అద్భుతమైన కెమిస్ట్రీ, నటనా నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. జోగేంద్ర పాత్రలో నవరసాలు పలికిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఇక అరణ్య సినిమాలోనూ హథీరాంగా మెప్పించారు. తాజాగా విడుదల అయిన ‘భీమ్లానాయక్’లోనూ తనదైన విలనిజం పండించారు. పవన్ కళ్యాణ్ తో ను నువ్వానేనా అన్నట్టు పోటీ పడి నటించారు. ‘‘హే నాయక్.. నీ ఫ్యాన్ వెయిటింగ్ ఇక్కడ’’ అంటూ డ్యానియల్ క్యారెక్టర్ లో ఇట్టే ఒదిగిపోయాడు. ఈ క్యారెక్టర్స్ చేయడానికి టాలీవుడ్ యువ నటులెవరైనా తీసుకోవాలని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ రానా నెగిటివ్ పాత్రలను నిజాయతీగా పోషించి ప్రేక్షకులను హృదయాలను గెలుచుకున్నారు.