‘ RC15 ‘ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం పంజాబ్ లో ఉన్న హీరో రామ్ చరణ్ .. అమృతసర్ లోని ఖాసా వద్దనున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శిబిరాన్ని సందర్శించారు. ఈసందర్భంగా తన వ్యక్తిగత చెఫ్ ను కూడా వెంట తీసుకెళ్లారు. అక్కడి సైనికుల కోసం.. క్యాంపులోనే కొన్ని ప్రత్యేక వంటకాలను వండించారు. అనంతరం సైనికులు అందరితో కలిసి ఆర్మీ క్యాంటీన్ లో కూర్చొని రామ్ చరణ్ మధ్యాహ్న భోజనం చేశారు. అంతకుముందు ఉదయం కూడా ఆర్మీ క్యాంటీన్ లోనే ఇడ్లి, వడ తో అల్పాహారం తీసుకున్నారు. ఈసందర్భంగా సైనికులతో రామ్ చరణ్ ఆప్యాయంగా మాట్లాడారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.
‘ ఖాసా బీఎస్ఎఫ్ శిబిరంలో సైనికులను కలిసినందుకు సంతోషంగా ఉంది. వారి విజయ గాధలు స్ఫూర్తిదాయకం. వారు దేశం కోసం చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివి ‘ అని పేర్కొంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. సైనికులతో కలిసి దిగిన పలు ఫోటోలను కూడా షేర్ చేశారు. కాగా, ‘ RC15 ‘ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె కూడా అమృతసర్ లోనే ఉన్నారు. అమృతసర్ స్వర్ణ దేవాలయానికి ప్రణామం చేస్తున్న ఒక ఫోటోను ఆమె ట్విటర్ లో షేర్ చేశారు. ప్రఖ్యాత దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీ లో.. ఒక యాక్షన్ థ్రిల్లర్ కథను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించనున్నారు.