Tickets Price Issue: చిరంజీవి పై ఆర్జీవీ షాకింగ్ సెటైర్స్

  • Written By:
  • Publish Date - February 11, 2022 / 11:51 AM IST

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని సమ‌స్య‌ల పై తాజాగా టాలీవుడ్ ప్ర‌ముఖులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధి పై టాలీవుడ్ పెద్ద‌లు సీఎం జ‌గ‌న్‌తో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో చ‌ర్చ‌లు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో ఇండస్ట్రీ నుండి చిరంజీవి, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, సినీ ర‌చ‌యిత, న‌టుడు పోసాని ముర‌ళీ కృష్ణ‌, హాస్య న‌టుడు అలీ, నారాయణ మూర్తి త‌దిత‌రులు భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ స‌మావేశంలో భాగంగా దాదాపు 17 అంశాల గురించి సినీ ప్ర‌ముఖులు, జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా, ఆయ‌న సానుకూలంగా స్పందించార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌తో భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడిన సినీ ప్ర‌ముఖులు.. ఏపీలో సినిమా టికెట్ ధ‌రల ర‌గ‌డ‌కు పుల్‌స్టాప్ ప‌డింద‌ని, వారం రోజుల్లో గుడ్ న్యూస్ వింటార‌ని తెలిపారు. ఇక ఈ భేటీలో జ‌గ‌న్ కూడా కొన్ని ప్ర‌తిపాద‌నలు చేశార‌ని స‌మాచారం. సినీ పరిశ్రమ విశాఖపట్నంకు త‌ర‌లి రావాలని, స్టూడియోలు క‌ట్టుకునేందుకు స్థ‌లాలు ఇస్తామ‌ని, రాష్ట్రంలో షూటింగ్‌లు జ‌రిగితే ప్ర‌భుత్వం నుండి ప్రోత్సాహకాలు ఇస్తామని జ‌గ‌న్ అన్నారు.

ఈ భేటీలో భాగంగా సినీ ప్ర‌ముఖుల‌తో పలు అంశాలను ప్రస్తావించిన జ‌గ‌న్, ఏపీలో సినిమా ఇండ‌స్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ప్రభుత్వ ఆలోచనలను జ‌న‌గ్ వారికి వివరించారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌స్తావించిన అంశాల పై సినీ పెద్ద‌లు కూడా సానుకూలంగా ఉన్నార‌ని తెలుస్తుంది. అటు ఏపీకి, ఇటు టాలీవుడ్‌కు ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ఉండాల‌నే విష‌యం స‌మావేశంలో కీల‌కంగా చ‌ర్చించార‌ని, సినీ ప్ర‌ముఖుల మాట‌ల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది. దీంతో ఏపీ స‌ర్కార్‌కి టాలీవుడ్‌కు మధ్య జ‌రిగిన‌ వార్‌కు శుభం కార్డు పడినట్లేన‌ని అంతా అనుకుంటున్నత‌రుణంలో, మిస్ట‌ర్ వివాదం, జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి.

ఏపీలో సినిమా టికెట్ రేట్ల ర‌గ‌డ తెర‌పైకి రాగానే, ఇష్యూ పై స్పందిస్తార‌ని భావించిన‌ చాలామంది టాలీవుడ్ ప్ర‌ముఖులు సైలెంట్‌గా ఉండ‌గా, అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన‌ ఆర్జీవీ జ‌గ‌న్ స‌ర్కార్ పై అగ్రెసీవ్‌గా కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌లు చాన‌ళ్ళ‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూల్లో భాగంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని దాదాపు ఇర‌కాటంలో పెట్టేలా, త‌నదైన స్టైల్‌లో ఏపీ ప్ర‌భుత్వం పై ప్ర‌శ్న‌లు సంధించారు. త‌ర్వాత మంత్రి పేర్ని నానితో భేటీ అయిన ఆర్జీవీ, ఆ వివాదం పై సైలెంట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు తాజాగా జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖులు భేటీ పై ఆర్జీవీ త‌న‌దైన శైలిలో స్పందించారు.

ముఖ్యంగా చిరంజీవిని టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ఓ మెగా ఫ్యాన్‌గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధ పడ్డాన‌ని ట్విట్ట‌ర్ సాక్షిగా చిరంజీవి పై సెటైర్ వేశారు. చిరు తమ్ముడు పవన్ క‌ళ్యాణ్‌ ఎప్పుడూ ఇలా బెగ్ చెయ్యడని, అందుకే ప‌వ‌ర్ స్టార్ ఎక్కువ పాపులర్ అయ్యాడ‌ని, చిరంజీవి నుండి ఇలాంటివి మెగా ఫ్యాన్స్‌కు న‌చ్చ‌వ‌ని, చిరు పై సెటైర్లు వేస్తూ వ‌ర్మ వరస ట్వీట్లు చేశారు. అయితే ఆ త‌ర్వాత‌ కొద్దిసేపటికే ఆ ట్వీట్ల‌ను ఆర్జీవీ రిమూవ్ చేయ‌డంతో, ఎప్పటిలాగానే రామ్ గోపాల్ వ‌ర్మ తీరుపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి ఇక‌ముందైనా ఆర్జీవీ కామ్‌గా ఉంటాడో లేక రాత్రికి వోడ్కా వేసి మ‌రోసారి ఈ వివాదం ర‌చ్చ ట్వీట్లు చేస్తాడో అనేది చూడాలి.