Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్థాయి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్.. ఇంటర్నేషనల్ లో పలు ప్రఖ్యాతి ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న మొదటి తెలుగు యాక్టర్ గా ఎంతో గౌరవాన్ని, ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఇప్పుడు మరో అరుదైన గౌరవని అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం వెలవబోతుందట.
ఇప్పటికే టాలీవుడ్ హీరోలు అయిన ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆ వరసలో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నారు. వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ కి ఉన్న పాపులారిటీని గమనించిన మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహుకులు.. లండన్ లోని మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట. ఈక్రమంలోనే రామ్ చరణ్ లండన్ ప్రయాణం చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా ఈ విగ్రహంలో రామ్ చరణ్ తో పాటు మరో ప్రాణి కూడా కనిపించబోతుంది. రామ్ చరణ్ కుక్కపిల్ల ‘రైమ్’ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చరణ్ ఎక్కడికి వెళ్లినా.. తన వెంట రైమ్ కూడా వెళ్లాల్సిందే. దీంతో రైమ్ కి కూడా వరల్డ్ వైడ్ గా మంచి పాపులారిటీనే లభించింది. అందుకే మ్యూజియంలో రైమ్ ని ఎత్తుకొని ఉన్న రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. కాగా ఈ విగ్రహ ఏర్పాటు వార్త పై చరణ్ టీం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు.