Site icon HashtagU Telugu

TG Vishwa Prasad : వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజాసాబ్ నిర్మాత

Tg Vishwa Prasad

Tg Vishwa Prasad

టాలీవుడ్ పరిశ్రమను, కార్మికులను కించపరిచేలా తాను మాట్లాడానని వస్తున్న విమర్శలపై ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) స్పందించారు. ఈ వివాదంపై స్పష్టత ఇస్తూ ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. తన విమర్శలు వ్యక్తులపైన కాదని, కేవలం వ్యవస్థపై మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అపారమైన ప్రతిభ ఉందని, తమ ప్రొడక్షన్స్‌లో 60 నుంచి 70 శాతం టీం హైదరాబాద్ నుంచే వస్తోందని ఆయన తెలిపారు. టాలెంట్ లేకపోవడం అనేది సమస్య కాదని, కొత్త టెక్నీషియన్లను, ఆర్టిస్టులను పరిశ్రమలోకి రాకుండా అడ్డుకునే కొన్ని గ్రూపులు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేయడమే ప్రధాన సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఇది నిజమైన ప్రతిభావంతులకు పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Varalakshmi Vratam: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా?

కొత్త టాలెంట్ రాకుండా అడ్డుకుంటూ, కేవలం తమ సొంత లాభాల కోసం వ్యవస్థను నియంత్రించే గ్రూపుల పైనే తాను మాట్లాడినట్లు విశ్వప్రసాద్ వెల్లడించారు. ఈ వ్యవస్థ పరిశ్రమ దీర్ఘకాలిక ప్రగతికి నష్టం చేకూరుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెజారిటీ టీం హైదరాబాద్ నుంచే వస్తోందని, మిగిలిన అవసరాలను కూడా ఇక్కడి ప్రతిభతోనే నింపాలని ఆయన అన్నారు. ‘నేను హైదరాబాద్‌ టాలెంట్‌ను తక్కువ అంచనా వేస్తున్నాననే అభిప్రాయం పూర్తిగా తప్పు’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు కల్పించి, బయటి నుంచి నియామకాలపై ఆధారపడకుండా స్థానిక ప్రతిభకు మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు.

హైదరాబాద్‌లోని సాంకేతిక నిపుణులు, కళాకారులు తెలుగు సినిమాకు ఎప్పటినుంచో అండగా ఉన్నారని, వారిని అడ్డుకుంటున్న వ్యవస్థలను తొలగించడం అవసరమని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి, స్థానిక ప్రతిభకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే, కేవలం లాభాల కోసం పనిచేసే గ్రూపులను అడ్డుకోవడం మనందరి బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రస్తుతం విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘రాజా సాబ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, గతంలో మలయాళంలో రూ.1 కోటి బడ్జెట్‌తో తీసే సినిమా తెలుగులో రూ.15 కోట్లు అవుతుందని, దీనికి ఇక్కడ భారీ రెమ్యూనరేషన్లు, కార్మికుల జీతాలు కారణమని ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.