Pushpa Keshava: ఒక యువతి ఆత్మహత్య కేసులో “పుష్ప” ఫేమ్ జగదీశ్ (బండారు ప్రతాప్)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఒక యువతిని ప్రేమించిన జగదీశ్.. ఆమెతో కొన్నాళ్లు కలిసి ఉన్నాడు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పేరు రావడంతో జగదీశ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. గమనించిన యువతి.. మరో యువకుడికి దగ్గరైంది. అది భరించలేకపోయిన జగదీశ్.. ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. ఆమెతో మాట్లాడాలని ఇంటికి వెళ్లగా.. అక్కడ మరో యువకుడితో సన్నిహితంగా కనిపించింది. ఆ దృశ్యాలను వీడియో తీసిన జగదీశ్ సోషల్ మీడియాలో పెడతానని యువతిని బెదిరించడంతో.. నవంబర్ 29న ఆత్మహత్యకు పాల్పడింది.
జగదీశ్ కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి.. డిసెంబర్ 6న జగదీశ్ ను అరెస్ట్ చేశారు. రెండ్రోజులు కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గతంలో తనతో కలిసి ఉన్న యువతి మరొకరితో క్లోజ్ గా ఉండటం భరించలేకే ఆమెను బెదిరించినట్లు వెల్లడించాడు. అలా ఆమెను తనదారిలోకి తెచ్చుకోవచ్చని అనుకున్నానని చెప్పాడు. కస్టడీ పూర్తి కావడంతో.. అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.