Site icon HashtagU Telugu

Pushpa 2 Release Date: ఆ రోజే పుష్ప-2 రిలీజ్.. ఫిక్స్ చేసిన నిర్మాతలు!

Pushpa 2 Release Date

Pushpa 2 Release Date

అల్లుఅర్జున్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ చిత్రం, అనుకున్న తేదీ (డిసెంబరు 6) కంటే ఒక రోజు ముందుగా డిసెంబరు 5న విడుదల కాబోతోంది. గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్  ఈ విషయాన్ని వెల్లడించారు. వారితోపాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు నిర్మాతలు సమాధానాలిచ్చారు.

ఒక రోజు ముందుగానే విడుదల చేయడానికి కారణం:

నవీన్ యెర్నేని: “యూఎస్‌లో బుధవారం నుంచి షోస్ ప్రారంభమవుతుండడంతో, లాంగ్ వీకెండ్‌ వళ్ళ కలిసివస్తుంది అని మా ఉద్దేశం . ఇక్కడ కూడా ఒక రోజు ముందుగా విడుదల కావడం మైలురాయిగా ఉంటుంది. అయినా, ‘పుష్ప’ ఎప్పుడు విడుదలైతే, అప్పుడే పండగ కదా!”

యలమంచిలి రవిశంకర్: “ఈ నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లతో చర్చించాక తీసుకున్నది.”

చిత్రీకరణ ఎందుకు ఇంకా కొనసాగుతోంది?

నవీన్ యెర్నేని: “అది యాదృచ్చికమే. మాకు మంచి క్వాలిటీ సినిమా అందించాలనే ప్రయత్నం ఉంది.”

యలమంచిలి రవిశంకర్: “చిత్రీకరణ మధ్యలో కొంత విరామం ఏర్పడింది. పర్‌ఫెక్షన్ కోసం ఆలస్యమైంది, కానీ ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి.”

కర్ణాటకలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రం ఏది? ఆ రికార్డును ‘పుష్ప 2’తో అధిగమించగలరా?

కర్ణాటక డిస్ట్రిబ్యూటర్: “‘బాహుబలి 1’ దాదాపు రూ. 30 కోట్లు, ‘బాహుబలి 2’ రూ. 70 కోట్లు వసూళ్లు సాధించాయి. ‘పుష్ప 1’ సుమారు రూ. 20 కోట్లు రాబట్టింది. ‘పుష్ప 2’ రూ. 80 నుంచి రూ. 100 కోట్ల వరకు కలెక్షన్స్ చేస్తుందని నమ్మకం ఉంది.”

‘పుష్ప 2’ విషయంలో జాతర ఎపిసోడ్‌పై ఎక్కువ చర్చ జరుగుతోంది. దాని కోసం ఎంత ఖర్చు చేశారు?

యలమంచిలి రవిశంకర్: “ఆ ఎపిసోడ్‌ చిత్రీకరణకు దాదాపు 35 రోజులు పట్టింది. రిహార్సల్స్ కూడా నిర్వహించాం. ఈ ఎపిసోడ్‌ మాత్రమే కాదు, ప్రతి సన్నివేశం కోసం దర్శకుడు సుకుమార్‌ మరియు అల్లు అర్జున్‌ చాలా కష్టపడ్డారు. అందరూ ఊహిస్తున్నట్టు ఆ ఎపిసోడ్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. డిమాండ్‌ మేరకు బడ్జెట్‌ కేటాయించాం.”

ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో ఎవరు నటిస్తున్నారు?

యలమంచిలి రవిశంకర్: “అది ఇంకా ఖరారు కాలేదు. తుది దశ చిత్రీకరణలో ఆ పాట మిగిలి ఉంది. నవంబర్ 4 నుండి షూట్‌ చేయాలనుకుంటున్నాం. రెండు రోజుల్లో ఆ వివరాలు వెల్లడిస్తాం.”

‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ. 1000 కోట్లను క్రాస్‌ చేసిందనే వార్తలు నిజమా?

యలమంచిలి రవిశంకర్: “థియేట్రికల్‌ మరియు నాన్‌ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నారు. అయితే, నాన్‌ థియేట్రికల్‌ విషయంలో ఇప్పటి వరకు ఏ సినిమాకూ చేయని బిజినెస్‌ చేశాం.”

డిసెంబరులో రావాల్సిన ‘గేమ్‌ ఛేంజర్’ సంక్రాంతికి వాయిదా పడిందని తెలిసింది. దాని గురించి ఏమనుకున్నారు?

యలమంచిలి రవిశంకర్: “రెండు వారాల్లోనే ఏ సినిమా అయినా 85 శాతానికి పైగా రికవరీ చేస్తుంది (కలెక్షన్స్‌ రాబట్టడం). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’, ‘యానిమల్‌’ వంటి సినిమాలు అలానే చేశారు. అంతకుమించి ఎక్కువ రోజులు ప్రదర్శితమైతే అదనపు వసూళ్లు వస్తాయి. ఒకవేళ ‘గేమ్‌ ఛేంజర్‌’ డిసెంబరులోనే విడుదలైనా, ‘పుష్ప 2’కు రెండు వారాలు సరిపోతాయనే అభిప్రాయంలో ఉన్నాం.”