సినిమా (Movie) అంటే వినోదం. పని ఒత్తిళ్లు , చికాకులు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారు కాసేపు సినిమా చూసి కాస్త రిలాక్స్ అవుదామని భావిస్తారు. కానీ ఈరోజుల్లో సినిమా చూడడం అనేది పెను భారంగా మారింది. దీనికి కారణం టికెట్ ధరలు భారీగా పెంచడం తో పాటు ఇంటర్వెల్ సమయంలో లభించే స్నాక్స్ ధరలు పెరగడమే. ముఖ్యముగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరో సినిమా వస్తుందంటే చూడలేని పరిస్థితి నెలకొంది. సినిమా బడ్జెట్ , కాస్ట్ & క్రూ రెమ్యూనరేషన్ అని చెప్పి నిర్మాతలు ప్రభుత్వాల దగ్గరి నుండి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం, ప్రీమియర్ షోస్ వేసుకొనే పర్మిషన్ తెచ్చుకొని, భారీగా టికెట్ ధరలు పెంచేస్తున్నారు. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయి. దీనికి ఉదాహరణ హరి హర వీరమల్లే.
Gold Price : ఈరోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక, సినిమాల టికెట్ రేట్లు పెంచుకోవడం, బెనిఫిట్ షోలు వేసుకోవడం ఈజీ అయిపోయింది. గతంలో “పుష్ప-2” టైమ్‌లో జరిగిన వివాదాల కారణంగా తెలంగాణలో ఈ రకమైన అనుమతులకు బ్రేక్ పడగా, ప్రస్తుతం మాత్రం చారిత్రక నేపథ్యం ఉన్న “హరిహర వీరమల్లు” సినిమాకు మినహాయింపులు ఇస్తూ టికెట్ ధరలను దాదాపు రెట్టింపు చేసుకునే అవకాశం ఇచ్చారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్మాతలు రేట్లను పెంచుకునే వెసులుబాటు పొందారు. అయితే ఈ పెంపులు వ్యాపార పరంగా ఎంత వరకూ ప్రయోజనకరమయ్యాయనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ప్రిమియర్స్ ప్రభావం – నెగెటివ్ టాక్‌తో వసూళ్ల పతనం:
అధిక టికెట్ ధరలతో మొదటి రోజు ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చినా, అదే షోల నుండి వచ్చిన నెగెటివ్ టాక్ సినిమాకు తీవ్రమైన దెబ్బ తీసింది. తాజాగా రిలీజ్ అయినా హరి హర వీరమల్లు చిత్రానికి నెగెటివ్ స్పందన రావడం సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. సినిమా టాక్ చెత్తగా ఉండడం, టికెట్ల ధరలు కొండెక్కి కూర్చువడం తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు రావడం మానుకున్నారు. బాలేని సినిమాకు సింగిల్ స్క్రీన్లో 300, మల్టీప్లెక్సులో 400-500 పెట్టి ఎవరైనా సినిమా చూస్తారా? ఫ్యామిలీని తీసుకుని వెళ్తే అయ్యే ఖర్చు ఎంత? పవన్ మీద అభిమానం ఉన్నా.. ఆయన ఎంతో కష్టపడి చేసిన సినిమాను ఎంకరేజ్ చెయ్యాలని అనిపించినా.. టికెట్ల ధరలకు భయపడి చాలామంది వెనుకంజ వేశారు. రేట్లు పెంచుకుని వీకెండ్లో సొమ్ము చేసుకుందామని నిర్మాతలు అనుకుంటే.. ఆ సంబరం ప్రిమియర్స్, తొలి రోజు షోల వరకే పరిమితం అయింది.
వీకెండ్ వ్యూహాల వల్ల నష్టాలు – మారాల్సిన ధోరణి:
ఏ సినిమాకైనా రెండో రోజు వసూళ్లు తగ్గుతాయి అనేది సాధారణం. కానీ ‘హరిహర వీరమల్లు’కి 70-80 శాతం డ్రాప్ కనిపించడమంటే, అధిక టికెట్ ధరల ప్రభావం ఎంత తీవ్రమో తెలుస్తోంది. ప్రేక్షకుడి మౌత్ టాక్‌తో సంబంధం లేకుండా ఓ సాధారణ రేటులో సినిమా విడుదలైతే ప్రేక్షకులు ఎక్కువ మంది చూస్తారనే వాస్తవాన్ని నిర్మాతలు గుర్తించాలి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు దక్షిణాదిలో అత్యధికంగా ఉన్న నేపథ్యంలో, మరోసారి అదనపు ధరలు విధించడం ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తోంది. ఈ ధోరణి కొనసాగితే, క్రేజున్న సినిమాలకైనా ప్రేక్షకుల మద్దతు దొరకకపోవడం, చివరికి థియేటర్ల వినోదం మరింత తగ్గిపోవడం ఖాయం. మరి నిర్మాతలు దీనిని గమనించి రాబోయే పెద్ద సినిమాలకైనా టికెట్ ధరలు పెంచకుండా ఉంటె బాగుంటుంది లేదంటే నష్టాలు చూడాల్సిందే.