‘మన శంకరవరప్రసాద్ గారు’ హిట్ జోష్ లో చిరు
బాబీ – చిరు కలయికలో మూవీ
డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్) గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే నాయిక విషయంలో గత కొన్నాళ్లుగా రకరకాల పేర్లు వినిపించగా, తాజాగా జాతీయ అవార్డు గ్రహీత, నటి ప్రియమణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి తన ఇటీవలి చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ విజయాన్ని ఆస్వాదిస్తుండగానే, బాబీ స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేసి నటీనటుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Mana Shankara Varaprasad Garu
ఈ సినిమాలో ప్రియమణి పాత్రకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని సమాచారం. ఆమె చిరంజీవి భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ మాస్ హిట్ తర్వాత బాబీ – చిరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో, ఇందులో పాత్రల రూపకల్పన చాలా బలంగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రియమణి కేవలం గ్లామర్ కోసమే కాకుండా, తన నటనతో పాత్రకు వెయిట్ తీసుకువచ్చే నటి కావడంతో ఆమె ఎంపిక దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, మెగాస్టార్ సరసన ప్రియమణికి ఇది ఒక భారీ అవకాశంగా మారుతుంది.
కేవలం భార్య పాత్రే కాకుండా, ఈ సినిమాలో చిరంజీవి కుమార్తెగా యంగ్ హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ డ్రామాలో కృతిశెట్టి పాత్ర కీలకం కానుందని టాక్. అయితే, అటు ప్రియమణి ఎంపికపై కానీ, ఇటు కృతిశెట్టి రోల్ గురించి కానీ చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం చిరంజీవి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, త్వరలోనే బాబీ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను, నటీనటుల జాబితాను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
