ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ రివ్యూ

The Raja Saab Movie  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌‌కి కూడా పండగే. అందులోనూ 2024లో ‘కల్కి 2898ఏడీ’తో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 2025లో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఆయన్ని సిల్వర్‌ స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ‘ది రాజాసాబ్’తో థియేటర్లలో అడుగుపెట్టారు ప్రభాస్. ఈ […]

Published By: HashtagU Telugu Desk
The Raja Saab Movie Review

The Raja Saab Movie Review

The Raja Saab Movie  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌‌కి కూడా పండగే. అందులోనూ 2024లో ‘కల్కి 2898ఏడీ’తో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 2025లో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఆయన్ని సిల్వర్‌ స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ‘ది రాజాసాబ్’తో థియేటర్లలో అడుగుపెట్టారు ప్రభాస్.

ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించడంతో… ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని ఆయన ఎలా డీల్ చేస్తాడోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. పైగా ప్రభాస్ ఫస్ట్ టైమ్ హార్రర్ ఫాంటసీ కామెడీ జోనర్‌ని ట్రై చేశారు. జనవరి 9 రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం 8వ తేదీనే ప్రీమియర్స్ ద్వారా థియేటర్లలో అడుగుపెట్టింది. ప్రభాస్-మారుతి కాంబినేషన్ ప్రేక్షకుల్ని మెప్పించిందా?.. తొలిసారి హారర్ జోనర్‌లోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఈ సంక్రాంతికి హిట్టు కొట్టాడా? అన్నది రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటి
రాజకుమారిపై మనసు పడిన ఓ స్వార్థపరుడి కథ ఇది. ఈ లోకంలో అన్నింటికీ డబ్బు ప్రధానం అనుకునే కనకరాజు (సంజయ్ దత్) దేవనగర సామ్రాజ్య జమిందారిణి అయిన గంగా దేవి(జరీనా వాహెబ్)పై కన్నేస్తాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకుని రాజ్య సంపదనంతా దోచుకోవాలని పథకం రచిస్తాడు. బైరాగి సాయంతో క్షుద్ర శక్తులను అవపోసన పట్టి ఆమెను తన వశం చేసుకుంటాడు. ఆ తర్వాత రాజ్య సంపదనంతా అపహరించి పరారవుతాడు. ఆ తర్వాత కనకరాజు ఏమయ్యాడు, గంగాదేవిని రాజ్యం వదిలి సామాన్యురాలిగా ఎందుకు బతకాల్సి వచ్చింది, ఇందులో గంగరాజు (సముద్రఖని) పాత్ర ఏంటి, నాయనమ్మ కోరిక మేరకు తాతను వెతికేందుకు హైదరాబాద్ చేరుకున్న రాజు(ప్రభాస్)కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే మిగతా కథ.

ఈ సినిమా కథంతా నర్సాపూర్ ఫారెస్ట్‌లోని కోట చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ షాట్‌లోనే కనకరాజుకి డబ్బంటే ఎంత పిచ్చో చెప్పేశాడు దర్శకుడు మారుతి. పరుల సొమ్ము కోసం ఆశపడే కనకరాజు తన మాయాజాలంతో అందరి నుంచి డబ్బులు దోచుకుని దాన్ని కోటలో దాచుకోవడం, చనిపోయిన తర్వాత కూడా ఆ సొమ్మంతా తనకే దక్కాలని, ఆ సంపదకు వారసుడు తాను మాత్రమేనని, ఇంకెవరికీ దక్కకూడదని ముందే వీలునామా రాసుకోవడం వంటి ఘటనలు ఆసక్తి రేపుతాయి. సెకండాఫ్‌లో సంజయ్ దత్‌కి ప్రభాస్‌ ఎదురుపడినప్పటి నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. వాళ్ల మధ్య మైండ్ గేమ్‌తో పాటు ప్రభాస్ కామెడీ టైమింగ్ కొత్తగా అనిపిస్తుంది. చనిపోయి ఆత్మగా మారిన తర్వాత కూడా తన భార్యని చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడన్నది ఉత్కంఠని కలిగిస్తుంది. నిజానికి రాజాసాబ్ దమ్మున్న కథే.. ప్రతి దమ్మున్న కథకి హీరో అంటే కథ, కథనమే. ఎంత పెద్ద కథానాయకుడ్నైనా నిలబెట్టేది కథే. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన సన్నివేషాలతో అసలు కథని గాడి తప్పించారు దర్శకుడు మారుతి.

ఎవరెలా చేశారు?
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు చాన్నాళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్‌‌ని చూస్తారు. ఏ విషయాన్నైనా సరదాగా తీసుకోవడం, బాగా వెటకారం కలగలిపిన ఆ క్యారెక్టర్‌లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. నాయనమ్మ కోసం ఎంతకైనా తెగించే మనవడిగా, ముగ్గురు భామల మధ్యలో ఇరుక్కున్న ప్రియుడిగా, తాత నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత అతడిని ఎలాగైనా అంతమొందించాలన్న పట్టుదలతో ప్రాణాలను సైతం లెక్కపెట్టక పోరాడటం వంటి సీన్స్‌లో ప్రభాస్ అలరించారు. ముఖ్యంగా ప్రభాస్ లుక్, మేనరిజం, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉన్నాయి.

ఇటీవల కాలంలో ప్రభాస్‌ నుంచి వరుసగా వస్తోన్న యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టేసిందనుకుంటోన్న ప్రేక్షకులకి ఈ సినిమా కాస్త ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఇక కనకరాజుగా సంజయ్‌దత్ విశ్వరూపం చూపించారు. డైలాగులు తక్కువైనా, తన నటనతో మెప్పించారు. ప్రభాస్ నాయనమ్మగా నటించిన జరీనా వాహెబ్ సెంటిమెంటుతో పిండేసింది. సినిమా అంతా సాధారణ మహిళగా కనిపించినప్పటికీ, క్లైమాక్స్‌లో రాణిగా ఆమె ఎంట్రీ అదిరిపోతుంది.

ఇక హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్‌లకు అందాల ఆరబోత తప్ప కథలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ముగ్గురిలో మాళవికా మోహనన్‌కి కాస్త ఎక్కువ స్పేస్ దక్కింది. గ్లామర్ విషయంలో ఎవ్వరూ తగ్గలేదు. సముద్రఖనిని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, సత్య పెద్దగా నవ్వించలేకపోయారు. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ సైక్రియాటిస్ట్ పద్మభూషణ్‌గా కీలక పాత్రలో కనిపించారు.

ఎలా ఉందంటే..
‘ది రాజా సాబ్’ కథ పరంగా చూస్తే అంత కొత్తదనమేదీ కనిపించదు. కథ పాతదైనా ప్రేక్షకుల్ని ఎలా మెప్పించామన్నది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మారుతి కాస్త తడబడినట్లే అనిపిస్తోంది. సినిమా ప్రారంభంలోనే సత్య ఎపిసోడ్‌తో కాస్త ఉత్కంఠ కలిగించినా ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ చూపించి సుమారు గంట పాటు స్టోరీని అక్కడక్కడే తిప్పుతూ చూపించాడు.

ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సన్నివేశాలతో సెకండాఫ్‌లో విషయం ఉంటుందని ప్రేక్షకులు అనుకోగా అక్కడా నిరాశే ఎదురైంది. కోటలో ఇరుక్కున్న హీరో అసలు పని వదిలేసి హీరోయిన్లతో రొమాన్స్ చేయడం, అతడి కోసం ముగ్గురు భామలు పోటీపడే సీన్లు అంతగా మెప్పించవు. ప్రీ క్లైమాక్స్‌ యాక్షన్ సీన్లు ఫర్వాలేదనిపించగా, క్లైమాక్స్ మాత్రం అంతగా మెప్పించలేదు. టీజర్ సమయంలో గ్రాఫిక్స్‌పై వచ్చిన విమర్శల్ని మేకర్స్ సీరియస్‌గా తీసుకుని బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తారని ఆశించిన ప్రేక్షకులకి నిరాశే ఎదురైంది. కొన్ని సీన్లలో గ్రాఫిక్స్ వర్క్ నాసిరకంగా ఉంది.

ఈ విషయంలో మేకర్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సిందేమో అనిపిస్తుంది. అయితే మొసలి ఫైట్ మాత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమా నిడివి ఏకంగా 3 గంటల 9 నిమిషాలు ఉండటంతో కొన్ని సీన్లు ల్యాగ్ అయి చాలాచోట్ల బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఇలా భారీ అంచనాలతో థియేటర్‌కి వెళ్లే అభిమానుల్ని మాత్రం రాజాసాబ్ కాస్త నిరాశపరచొచ్చు. కానీ ప్రభాస్ ఎంటర్‌టైన్‌మెంట్, వింటేజ్ కామెడీ టైమింగ్ మాత్రం కచ్చితంగా అలరిస్తుంది. మొత్తానికి అయితే మారుతి ఇంకాస్త ఎంగేజింగ్‌గా స్క్రీన్‌ప్లే రాసుకొని ఉంటే బావుండేది.

ఇక తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా తమన్ నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టేస్తాడనే పేరుంది. కానీ ‘రాజాసాబ్’లో అవసరమైన దానికంటే అనవసరమైన దరువులే ఎక్కువ వినిపిస్తాయి. ఫస్టాఫ్‌లో పాట, ఫైట్‌తో ప్లేస్ మెంట్‌ని సెట్ చేసుకుంటూ వెళ్లారు. తమన్ పాటలు రన్ టైమ్‌కి తప్పితే రాజాసాబ్ రన్ వే‌కి హెల్ప్ కాలేకపోాయాయి. హడావిడి ఎక్కువ ఔట్ పుట్‌ తక్కువ అనేట్టుగానే ఉంది తమన్ మ్యూజిక్. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ గ్రాండ్‌గా అనిపిస్తుంది. ముగ్గురు హీరోయిన్లకు కథలో పెద్ద స్కోప్‌ లేకపోయినా తన కెమెరా లెన్స్‌‌కి మాత్రం బాగా పనిపెట్టారు. ప్రభాస్‌ని లుక్‌లో చాలా ఛేంజస్ కనిపిస్తుంటాయి. ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తుంటాడు. ఒకసారి భలే బావున్నాడే అనిపిస్తుంది.. కొన్ని షాట్స్‌లో మాత్రం ఇదేంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంటుంది.

ముందుగా చెప్పినట్టు 3 గంటల 9 నిమిషాల రన్ టైమ్ ఈ సినిమాకు పెద్ద మైనస్. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఓ అరగంట వరకూ ట్రిమ్ చేసి ఉంటే కాస్త రిలీఫ్ అనిపించేది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కోట్లాది రూపాయలు (రూ.400 కోట్లు) ఖర్చు చేశామన్నారు. కానీ ఆ ఖర్చుకి తగ్గ ఔట్ పుట్‌ని పూర్తి స్థాయిలో అందించలేకపోయారు మారుతి. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే.. ఎంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోనైనా నిలబెట్టేది కథే. కథ కోసం కథానాయకుడు ఉండాలి తప్పితే.. కథానాయకుడి ఇమేజ్ కోసం కథని కిచిడీ చేస్తే రిజల్ట్ ‘రాజాసాబ్’లా ఉంటుంది మారుతీ సాబ్.

పంచ్ లైన్: రాజాసాబ్.. పండగ కిక్కు సరిపోలేదు రాజా

  Last Updated: 09 Jan 2026, 10:30 AM IST