ఈ ఏడాది సంక్రాంతి రేసులో భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. టాలీవుడ్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించి పరిశ్రమకు మంచి ఊపునిచ్చినప్పటికీ, అందరికంటే ముందుగా వచ్చిన ‘రాజాసాబ్’ నిరాశ పరచడం అభిమానులను కలచివేసింది. ఈ సినిమా గనుక విజయం సాధించి ఉంటే 2026 సంవత్సరానికి టాలీవుడ్ స్థాయి మరో మెట్టు పైకి ఎదిగి ఉండేదని, కానీ ఒక మంచి అవకాశం జారిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Raajasaabh Ticket
సినిమా ఫలితం తేడా కొట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతిని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. కథాకథనాల్లో లోపాలు ఉన్నాయని, ప్రభాస్ లాంటి భారీ స్టార్‌ను సరిగా వాడుకోలేదని మారుతిపై, ప్రొడక్షన్‌లో చురుగ్గా ఉన్న ఎస్‌కేఎన్ (SKN)పై ట్వీట్ల రూపంలో దాడి జరుగుతోంది. అయితే, ఒక సినిమా పరాజయానికి కేవలం దర్శకుడినే బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుడు దగ్గరుండి చేయించుకున్న ‘వంటకం’ లాంటి ఈ సినిమా వైఫల్యంలో అందరి బాధ్యత ఉందనేది వాస్తవం.
లోపల జరుగుతున్న చర్చల ప్రకారం, ‘రాజాసాబ్’ విషయంలో కీలక నిర్ణయాలన్నీ ప్రభాస్ ఆధ్వర్యంలోనే జరిగాయట. హారర్ కామెడీ కథను ఎంచుకోవడం నుండి, ముగ్గురు హీరోయిన్ల ఎంపిక, బాలీవుడ్ రీమిక్స్ సాంగ్ ఐడియా మరియు ఎడిటింగ్ టేబుల్ వద్ద ప్రభాస్ పాత గెటప్ ఫైట్ సీక్వెన్స్‌ల వరకు ఆయన ప్రమేయం ఉందని అంటున్నారు. సినిమా విజయం సాధిస్తే క్రెడిట్ మొత్తం అందరూ పంచుకున్నట్టే, పరాజయం పాలైనప్పుడు కేవలం దర్శకుడిని లేదా నిర్మాణ బృందాన్ని నిందించడం అమానుషం. ఒక సినిమా అనేది సమష్టి కృషి ఫలితం, కాబట్టి దాని వైఫల్యానికి కూడా టీమ్ అంతా బాధ్యత వహించడమే సరైన ధర్మం.
