Site icon HashtagU Telugu

Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ విడుదల ఎప్పుడంటే..!

Ponniyin Selvan Imresizer

Ponniyin Selvan Imresizer

ఇండియన్ స్పీల్ బర్గ్ గా కీర్తించబడుతున్న స్టార్​ డైరెక్టర్​ మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘పొన్నియన్​ సెల్వన్​’. రెండు భాగాలుగా దీన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో ‘పొన్నియన్ సెల్వన్’ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో విక్రమ్​, ఐశ్వర్య రాయ్​ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవిలు నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్​లుక్​ లను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.

అసలు మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటేనే… ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులంతా ఆ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే తెరపై ఆయన కథ చెప్పే విధానం కావచ్చు, పాత్రలను మలిచే తీరు కావచ్చు, నటీనటులనుంచి నటనను పిండే విధానం కావచ్చు…. అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ కూడా లైఫ్ లో ఒకసారైనా ‘మణి’ సార్ దర్శకత్వంలో నటించాలని కలలు కంటూ ఉంటారు. ఆయన తీసిన ‘నాయకుడు’, ‘రోజా’, ‘బొంబాయి’, ‘సఖి’, ‘ఓకే బంగారం’… ఇలా చెప్పుకుంటూ పోతే… ఎన్నో అద్భుత కళాఖండాలను ఆయన తెరకెక్కించారు.

ఇక తాజాగా ‘పొన్నియన్‌ సెల్వన్‌-1’ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఒక్కొక్కటి ఒక్కోలా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలుగా చేసిన విక్రమ్​, ఐశ్వర్య రాయ్​ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవిలకు సంబంధించిన ఫస్ట్​లుక్ ​లు మాత్రమే విడుదలయ్యాయి. వీటితో పాటు ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్-1 రిలీజ్ డేట్ ను చిత్ర బృదం ప్రకటించింది. 2022, సెప్టెంబర్ ​30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ఒక్కో పోస్టర్​ ను మతి పోయోలా తీర్చిదిద్దారని మణిరత్నం ప్రతిభ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ 2019 డిసెంబర్‌లోనే థాయ్‌లాండ్​లో ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా చిత్రీకరణ‌ వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ మూవీని మద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత అయిన ఏ.ఆర్.రెహమాన్‌ ‘పొన్నియన్ సెల్వన్’ కు సంగీతం సమకూరుస్తున్నారు. చోలుళ కాలం నాటి కథతో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాన్ని దర్శకుడు మణిరత్నం ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.