Site icon HashtagU Telugu

Allu Arjun : అల్లు అర్జున్ పై కేసు.. ఆ విద్యాసంస్థ విషయంలో తప్పుదోవ పట్టించారంటూ ఫిర్యాదు

allu arjun

allu arjun

అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. సినిమా పరంగా పుష్పాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ ను అందుకున్నా.. యాడ్స్ రూపంలో మాత్రం కలిసిరావడం లేదు. ఇప్పుడు బన్నీ ప్రమోట్ చేసిన ఓ వ్యాపార ప్రకటన విషయంలో ఆయనపై కేసు నమోదైంది. శ్రీచైతన్య విద్యాసంస్థల కోసం అల్లు అర్జున్ ఈమధ్య ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. కానీ అందులో ఇచ్చిన సమాచారం అవాస్తవమంటూ సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్ పైనా, ఆ విద్యాసంస్థలపైనా అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో కేసును ఫైల్ చేశారు.

అల్లు అర్జున్ నటించిన శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రకటన అందరినీ తప్పుదోవ పట్టించేలా ఉందన్నది ఫిర్యాదు చేసిన వారి ఆరోపణ. కిందటి నెల.. అంటే జూన్ 6న వివిధ పత్రికల్లో ఆ విద్యాసంస్థకు సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకులపై ప్రకటన వచ్చింది. దీనిని అప్పుడు ప్రమోట్ చేసింది అల్లు అర్జునే. కానీ ఆ ప్రకటనలో ఇచ్చిన సమాచారం అంతా అబద్ధమని.. అందుకే అలాంటి తప్పుడు ప్రకటనలపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు కోరాడు. వాస్తవాలు తెలుసుకోకుండా అలాంటి తప్పుడు ప్రకటనలో నటించిన అల్లు అర్జున్ పైనా, దానిని జారీ చేసిన విద్యాసంస్థపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

అల్లు అర్జున్ కు ఈమధ్య కాలంలో నటించిన యాడ్స్ వర్కవుట్ అవుతున్నట్టు లేదు. ఎందుకంటే జొమాటో, ర్యాపిడో ప్రకటనల్లో నటించినందుకు కూడా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి పుష్ప తరువాత బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో వ్యాపార సంస్థలు కూడా ఆయనతో యాడ్స్ కోసం భారీగా ఒప్పందాలు చేసుకున్నాయి. అయినా బన్నీకి అవి అంతగా కలిసిరాలేదనే చెప్పాలి.