WAVES 2025 : కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ‘వేవ్స్’ కార్యక్రమానికి నాంది పలికింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఈవెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ముంబయి వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న ఈ సమ్మిట్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ చలన చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ప్రసంగించారు. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం నటీనటులు, కళాకారులు అందిస్తోన్న సేవలను కొనియాడారు.
Read Also: Caste Survey in India : కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది – సీఎం రేవంత్
వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ.. పేర్కొన్నారు. గత 100 సంవత్సరాలలో, భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుందని ప్రధాని మోడీ అన్నారు. WAVES సమ్మిట్ సృజనాత్మకత కేంద్రంగా అభివర్ణించారు. వేవ్స్ సమ్మిట్ 2025 (కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్) తో 100 కి పైగా దేశాల నుంచి కళాకారులు, సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఒకే గొడుగు కిందకు వచ్చారని ప్రధాని మోడీ అన్నారు
ప్రపంచం నలుమూలల నుంచి సృజనాత్మక కళాకారులు, స్టార్ట్ అప్‌లు, సినీవినోద రంగ ప్రముఖులు, విధాన నిర్ణేతలు ఇందులో పాల్గొంటున్నారు. సినిమాలు, ఓటీటీ, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన అన్నింటిని ఒకే వేదికపై అనుసంధానిస్తూ మీడియా , వినోద రంగంలో మన దేశ సత్తాను చాటడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ అన్న ట్యాగ్ లైన్‌తో ఈ ‘వేవ్స్’ను నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే లక్ష మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఈ ‘వేవ్స్ 2025’లో 1100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. వివిధ సమావేశాలు, ప్రదర్శనలు, చర్చా గోష్ఠులు సాగే ఈ సదస్సుకు నటులు చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, దర్శకుడు రాజమౌళి, ఆస్కార్ అవార్డు గ్రహీతలైన సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, కీరవాణి తదితరులు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్ అప్‌లు ఈ భారీ సదస్సులో పాలు పంచుకుంటున్నాయి. ఇక, సినిమాలు, డిజిటల్ మీడియా, బ్రాడ్ కాస్టింగ్ తదితర విభిన్న రంగాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి. ఈ ‘వేవ్స్’లో భాగంగా దాదాపు 25 దేశాలకు చెందిన మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొనే ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ (జి ఎం డి) కి మన దేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తుండడం మరో పెద్ద విశేషం.