డా.ప్రసాదమూర్తి
ఆమె పేరు ప్రేరణ. అతని పేరు అనికేత్. అతను మరణ శయ్యపై మృత్యువుకు అత్యంత సమీపంలో ఉంటాడు. ఆమె ఒక మెడికల్ కౌన్సిలర్. మృత్యువుకు అతి సమీపంలో ఉన్నవారికి ఆమె అతి సమీపంలో ఉంటుంది. కేవలం భౌతికంగానే కాదు, ఆతంరంగికంగానూ ఆమె సాన్నిహిత్యం వారితో ఉంటుంది. ఆమెకు భర్త, తల్లి ఉంటారు. అనికేత్ కి ఎవరూ ఉండరు. ఉండొచ్చు కానీ ఎవరో ఉన్నారని అతను చెప్పడు. ఎవరో ఉండాలని కూడా అతను కోరుకోడు. జీర్ణకోశ క్యాన్సర్ అతనికి. మరి కొన్ని రోజులే బతుకుతాడు. ఎందరికో ప్రేరణగా ఉండే ఆమె అనికేత్ కి కూడా ప్రేరణగా నిలుస్తుంది. ఆ ప్రేరణ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. దాన్ని ప్రేమ అనాలో స్నేహం అనాలో అలౌకిక బంధమనాలో మనం కొన్ని తెలిసిన పద బంధాలతో చెప్పలేం. కేవలం చూస్తూ ఉంటాం అంతే. అతని ప్రతి మాటా ఒక కవితా వాక్యమే. ప్రతి వాక్యమూ ఒక తాత్త్విక చింతనా భరిత సంవేదనే.
కవిత్వంలో తత్త్వం ఉంటుంది కానీ తత్త్వంలో కవిత్వం ఉండదు. ఈ రెండూ కలిసిపోతే ఆ మేళవింపు స్వాతి నక్షత్రం నుంచి జారిన వాన చినుకై మన గుండె ఆల్చిప్పలో ముత్యమై మెరుస్తుంది. అదిగో అలాంటి ఈ సినిమా నిన్ననే చూశాను. చూసిన వెంటనే మీకు చెప్పకుండా ఉండలేకపోయాను. ఎంత రక్తపాతం ఉంటే.. ఎంత హింస ఉంటే అంత గొప్ప సినిమా అవుతుందని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. వేల కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ స్వచ్ఛమైన మనిషి గుండెను కొల్లగొట్టే సినిమాలు మాత్రం స్వాతి చినుకుల్లా ఎప్పుడో గాని రావు. అలా వచ్చినప్పడు వాటిని ఒడిసి పట్టుకోవాలంతే. స్వాతి ముత్తిన మళె హనియే అనే కన్నడ సినిమా గురించి చెప్తున్నాను. కన్నడ రాకపోయినా భాషతో ప్రమేయం లేకుండా దీన్ని చూసి మీరు ఆర్ద్రమైపోగలరు. ఇంగ్లీషు సబ్ టైటిల్స్ ఉంటాయి. మాటలను, పాటలను, మాటల్లో పాటల్లో ఉండే మానవోద్వేగాలను, మానవ తాత్త్విక చింతననూ అర్థం చేసుకుంటేనే గాని ఆ డిజిటల్ సరస్సులో కదిలే అలల్లో మెదిలే దృశ్యాల్లో మానవాత్మను దర్శించలేం.
ప్రేరణకు ఇంటి దగ్గర భర్త నుంచి ఎలాంటి అనురాగం, ఆప్యాయత, ప్రోత్సాహం లభించదు. అతనొక తిరుగుబోతు. ఆమె లేనప్పుడు అమ్మాయిల్ని ఇంటికే తెచ్చుకుంటాడు. ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ ఏదో పనిలో వుంటాడు. ఆమె ఒక కమిటెడ్ కౌన్సిలర్. మరణానికి దగ్గరగా ఉన్న రోగుల ఆశ్రమంలాంటి హాస్పటల్ లో ఆమె పని చేస్తుంది. ఊటీలో చక్కని చల్లని ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య ఆ హాస్పటల్ ఉంటుంది. డాక్టర్ మందులు మాత్రమే ఇస్తాడు. ఆమె ప్రేమను పంచుతుంది. అందుకే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఆమె నుంచి జీవితంలోని మధురమైన ఆనందాన్ని పొందుతారు. ప్రేరణ ఎప్పుడూ కనులకూ మనసుకూ హాయినిచ్చే లేత రంగుల కాటన్ చీరలే కడుతుంది. ఆమె చూపులు అంత కంటే హాయినిస్తాయి. బహుశా ఆధునిక రూపంలో ఉన్న బౌద్ధ భిక్షుణి కావొచ్చు. ఆమెను చూస్తుంటే రోగులకే కాదు మనకూ జీవితంలోని తెలియని రుచి ఏదో తెలుస్తున్నట్టు ఉంటుంది. ఆమె బాహిరకమైన రూపంలోంచి ఆమె కళ్ళల్లోంచి ఆమె మాటల్లోంచి ఆమె ఆత్మ సౌందర్యం మన హృదయాల అంచుల మీద వెన్నెలలా తచ్చాడుతుంది.
అనికేత్ తన వెనకే మృత్యువును తీసుకుని ప్రేరణ పనిచేసే ఆ కాటేజెస్ లో చేరతాడు. ముందు అతను తన ఐడెంటిటీని చెప్పడు. తన అడ్రస్ గాని, తన బంధువుల అడ్రస్ గాని ఇవ్వనని మొరాయిస్తాడు. కానీ రూల్స్ ఒప్పుకోవంటే ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి అతను అక్కడ చోటు సంపాదించుకుంటాడు. తన గదిలో కిటికీ దగ్గరే కూర్చుంటాడు. ప్రకృతి ప్రేమికుడు. జీవన స్వాప్నికుడు. మరి కొద్ది రోజుల్లోనే అనంత లోకాలకు చేరే ప్రయాణికుడు. ప్రేరణ అతని పట్ల ముందు కొంచెం కటువుగా ఉండి అతను మాట వినేలా లేడని పంపించేయమని యాజమాన్యానికి రాస్తుంది. కానీ అతను ఒక రోజు కొండ మీద పచ్చిక మైదానంలో పడుకుని ఉంటాడు. అతన్ని వెదుక్కుంటూ వెళ్లి అతని పక్కనే ఉన్న నోట్ బుక్ లో ఏదో రాసి ఉంటే దాన్ని నలిపేసి అతన్ని గదికి చేరుస్తుంది. ఇంటికి వెళ్లేటప్పుడు కారులో అతను రాసిన పేపర్ ఉండ విప్పి చదువుతుంది. అందులో అంతా జీవితం, తాత్వికత, కవిత్వమూ కలగలిసిన ఏదో గొప్ప వెలుగు ఆమెకు కనిపిస్తుంది. అతని విషయం నేను చూసుకుంటానని అతన్ని ఇక్కడే ఉంచమని మళ్ళీ యాజమాన్యానికి చెప్తుంది. సరే అంటారు. రోజూ అతనికిష్టమైన చోట కూర్చుని ప్రకృతిని అలా ఆస్వాదించడం, అతనితో కలిసి కాఫీ తాగడం, అతను చెప్పే లోతైన విషయాలను వినడం చేసేది. అతని చల్లని హృదయం, ఆ హృదయం నుంచి వీచే చల్లని వెన్నెల గాలుల తన్మయత్వం ఆమె హృదయాన్ని తాకింది. ఆమెలో అతను, అతనిలో ఆమె ఏదో తెలియని జీవనానందాన్ని పొందుతున్నారు. అతన్ని పడుకోబెట్టడానికి కొన్ని సార్లు డ్రగ్స్ కూడా ఇస్తుంది. అది డాక్టర్ ఒప్పుకోడు. వార్నింగ్ ఇస్తాడు. రోగులు డ్రగ్స్ కి అలవాటు పడి పదేపదే అడుగుతారని డాక్టర్ వాదన. కానీ ప్రేరణ మదిలో, కొన్ని రోజుల్లో చనపోయేరికి అలవాట్లేమిటి అనే వేదనే ఉంటుంది. అనికేత్ ఒకరోజు ఏవో ఆకులతో సిగరెట్టు తయారు చేసుకుంటాడు. అతనికి ప్రమాదమైనా సిగరెట్టు కాల్చనిస్తుంది. అతని కోరిక మేరకు రాత్రి అక్కడే ఉంటుంది. తానూ కొంచెం దగ్గుతూ కాలుస్తుంది. పక్కనే పడుకోమంటే పడుకుంటుంది. అతనేదొ ఫిలాసఫీ చెప్తుంటాడు. అతన్ని గట్టిగా వాటేసుకుని నుదుటి మీద ముద్దులు పెడుతుంది. ఈ దృశ్యానికి భాష్యం చెప్పడానికి ప్రేమ అనే మాట అతి సూక్ష్మాతి సూక్ష్మంగా తేలిపోతుంది.
ఆ రోజు సాయంత్రం హాస్పటల్ కి వెళ్ళేటప్పుడు భర్త నిలదీస్తాడు. రాత్రుళ్లు కూడా కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలైందంటాడు. అప్పుడు ప్రేణ తల్లి కూడా అక్కడే వుంటుంది. ఆమె ఆ నిమిషంలో అతన్ని చూస్తుంది కదా, కేవలం ఒక్క నిమిషం పాటు ఉండే ఆ దృశ్యాన్ని చూసి తీరాలి. ఆమ కళ్ళల్లో పెదవుల్లో ఏదో కాంతి కనిపిస్తుంది. కోపం ఆగ్రహం కనిపించవు. కేవలం ఒక చిరునవ్వుతో కూడిన దయాపూరిత నేత్రాలను మాత్రమే చూస్తాం. నన్నిలా ప్రశ్నించే ధైర్యం నీకెలా వచ్చింది అని అంటుంది. అతను ఏమంటాడు..ఆమె ఏం చెప్తుంది ఆ సీన్ ఎవరికి వారే చూసి ఎవరికి తోచింది వారు అర్థం చెప్పుకోవాలి. డాక్టర్ అడుగుతాడు. ప్రేరణా నువ్వు నిన్న రాత్రి ఎక్కడున్నావని. ఆమె చెప్తుంది. అతనేదో అనే లోపలే ఆమె అంటుంది కదా, “ అతనితో సిగరెట్టు కాల్చాను. అతని పక్కనే పడుకున్నాను. అతన్ని కౌగలించుకున్నాను. అతని నుదుటి మీద ముద్దు పెట్టాను. కృశించిపోయిన అతని ఆరోగ్య పరిస్థితి రీత్యా మరేమీ చేయలేకపోయాం.” అంటుంది. ఫ్లాట్. ఆ డాక్టర్ తో పాటు, మనమూ, ఆ మాటలు వినకపోయినా ఆ మాటలు తగిలే ఆమె భర్తా, అందరికీ తల తిరిగిపోయే సమాధానం. స్త్రీ పురుష బంధాల సమస్త శాస్త్రాల యుగాల ఆధిపత్యాల అహంకారాలకు ఒకే ఒక్క చెంప పెట్టు. భర్తతోనైనా, ఇక్కడ డాక్టర్ తోనైనా అనికేత్ తో అయినా ఆమె అన్ని చోట్లా ఒకే నిర్మల కాంతి సరస్సులా కనిపిస్తుంది. అనికేత్ చనిపోతాడు. తాను చెప్పిందంతా అబద్ధమని, తనకెవరూ లేరని అంటాడు. అతని దహన సంస్కారం తనే చేస్తుంది. అతని కోరిక మేరకు ఒక రెడ్ బస్కెక్కి మలుపు మలుపులో అతని చితాభస్మాన్ని ఒలకబోస్తుంది. దారి పక్కన ఏ మొక్కలోనో ఏ పువ్వులోనో మమేకమై లోకాన్ని, మనుషులనూ చూస్తూ ఉంటానని అనికేత్ అంటాడు. బహుశా అందరం అంతేనేమో.
We’re now on WhatsApp. Click to Join.
ఆ సినిమాలో అనికేత్ క్యారక్టెర్ కి డైరక్టర్ రాజ్ బి.శెట్టి, ప్రేరణ రోల్ కి సిరి శివకుమార్ ప్రాణం పోస్తారు. ఫ్రేమ్ ఫ్రేమ్ లో, పాట పాటలో, మాట మాటలో దర్శకుడు ప్రకృతి, ఇతర జీవులు, మానవుడు, పుట్టుక, మరణం ఇలా ఒక అనంత చింతనామయ పరిమళాన్ని నింపుతాడు. శత్రువును వ్యతిరేకించు. కానీ అతని మీద పగతోనో ద్వేషంతోనో కాదు ప్రేమతో ఆ పనిచేయి అంటాడు బుద్ధుడు. ఆ మాటలకు సాక్షీభూతంగా వెండి తెరమీద ప్రేరణను నిలువెత్తున నిలబెట్టి దర్శకుడు ధన్యుడయ్యాడు. ఎప్పుడు స్వాతి నక్షత్రం నుంచి వాన చినుకు రాలి సముద్రపు ఆల్చిప్పలో పడుతుందో తెలీదు. అనికేత్ గుండెలో ఆ స్వాతి చినుకు ప్రేరణ. ఆమె జ్ఞాపకాల ముత్యాన్ని తనలో దాచుకుని అతను వెళ్ళిపోతాడు. అతని జ్ఞాపకాల ముత్యాన్ని తన గుండెల్లో నింపుకుని ప్రేరణ ఉండిపోతుంది. జీవితమూ మరణమూ మధ్య ప్రేమ అంటే ఏమిటో తాత్త్వికంగా చూపించిన ఈ సినిమా మీరూ చూడండి. మీలో మీకు తెలియని ద్వారాలు తెరుచుకుంటాయి. హిందీలో వహీదా నటించిన ఖామోషి, తెలుగులో సావిత్రి నటించిన చివరికి మిగిలేది అనే సినిమాలున్నాయి. వాటికీ దీనికీ చాలా తాత్వికమైన మౌలికమైన భేదం ఉంది. డైరెక్టర్ రాజ్.బి.శెట్టి కన్నడ ఇండస్ట్రీలో చాలా పాపులర్. అతను తీసిన 777 చార్లీ గతంలో చూశాను. సూపర్ మూవీ. అతనిలోని డాగ్ లవర్ నన్నువిపరీతంగా ఆకట్టుకున్నాడు. జీవయాత్ర తుది మజిలీ మరణం అని కదా బౌద్ధం చెప్తుంది. ప్రేమ లేకపోవడమే మరణం. ఆ ప్రేమ ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ రహస్య దారుల్లోంచి వచ్చి ఎవరి ఆత్మల్ని కమ్మేస్తుందో చెప్పలేం. కన్నడంలో ఒక పాపులర్ పాట ఉంది స్వాతి ముత్తిన మళె హనియే అని. అదే ఈ సినిమా టైటిల్ అయింది. ఇలాంటి సినిమాలు ఎప్పుడో గాని రావు. వస్తే అవి కొన్ని జన్మలకు సరిపడా మానవ జీవన మహదానందాన్ని ఇస్తాయి.
Read Also : Road Accident : భూపాలపల్లి జిల్లాలో పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు..డీసీఎం ఢీ..
