Payal Rajput : RX100 సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘పాయల్ రాజ్‌పుత్’. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ ని సంపాదించుకున్న పాయల్.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి అలరించారు. అయితే ఆ మధ్యలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డారు. ఇటీవల ‘మంగళవారం’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని.. మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. దీంతో పాయల్ రాజ్‌పుత్ మళ్ళీ ట్రాక్ ఎక్కి.. కొత్త సినిమాలకు సైన్ చేస్తూ ముందుకు కదులుతున్నారు.
అయితే ఈ సమయంలో పాయల్ కి పలానా నిర్మాతల నుంచి బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని పాయల్ తన సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేసారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. 2019-2020 సమయంలో పాయల్ ‘రక్షణ’ అనే సినిమా చేసారు. అయితే అది ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఇక రీసెంట్ గా మంగళవారంతో పాయల్ కి వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని.. ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసి లాభ పడాలి నిర్మాతలు భావిస్తున్నారట.
ఈక్రమంలోనే పాయల్ ని ప్రమోషన్స్ కి రమ్మని కూడా బలవంతం పెడుతున్నారట. అయితే ఆ నిర్మాతల నుంచి పాయల్ కి రావాల్సిన రెమ్యూనరేషన్ ఇంకా బాకీ పడే ఉందట. కాగా పాయల్ ప్రస్తుతం కొత్త సినిమా కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉన్నారట. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కష్టమని చెప్పారట. కావాలంటే.. డిజిటల్ ప్రమోషన్స్ వరకు అయితే చేస్తానని చెప్పారట. కానీ ఆ నిర్మాతలు అందుకు ఒప్పుకోవడం లేదంట.
మూవీ ప్రమోషన్స్ కి రాకపోతే టాలీవుడ్ లో తనని బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారట. అంతేకాదు అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారట. ఇక వీటిన్నటికి విసుగెత్తిపోయిన పాయల్.. ఇప్పుడు లీగల్ గా ముందుకు వెళ్ళబోతున్నట్లు తెలియజేసారు. అయితే ఆ నిర్మాతలు ఎవరు అన్నది మాత్రం తెలియజేయలేదు.