పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ కు సంబంధించిన సెట్స్ ను దగ్గరుండి మరీ కంప్లీట్ చేయించాడు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున సెట్స్ వేశారు. చార్మినార్, చాందిని చౌక్ లాంటి సెట్స్ కూడా అందులో ఉన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నారు.
దర్శకుడు క్రిష్ ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ కు సంబంధించిన రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసి కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ చేస్తే.. మేజర్ పార్ట్ కంప్లీట్ అయ్యేవరకు చిత్రీకరణ ఆగకుండా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. పవన్ కూడా ‘హరిహర వీరమల్లు’ కోసం ఓ 45 రోజుల పాటు అందుబాటులో ఉండనున్నారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ‘హరిహర వీరమల్లు’ తదుపరి షెడ్యూల్ ను మార్చ్ 18 నుండి మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. గతంలో పవన్ తో ఏఎం రత్నం ‘ఖుషీ’ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఎంఎం కీరవాణి తన ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం సంగీతాన్ని అందిస్తున్నారు. పవర్ స్టార్ కి ఫస్ట్ టైమ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు ఎంఎం కీరవాణి. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా… అర్జున్ రామ్ పాల్ విలన్ గా, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘హరిహర వీరమల్లు’ సినిమా కథ విషయానికొస్తే… మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ ఓ గజ దొంగగా కనిపించబోతున్నారట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ ను భారతీయ అన్ని భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలానే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలోనూ విడుదల చేయనున్నారు. ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ నుంచి విడుదలయ్యే మూవీ ‘హరిహర వీరమల్లు’ సినిమానే.
