Naga Babu : మెగా బ్రదర్ గా ఇండస్ట్రీకి వచ్చిన నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా పలు సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. అలాగే తన బ్రదర్స్ ని అనుసరిస్తూ పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పనులన్నీ నాగబాబు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈక్రమంలోనే తమ ప్రత్యర్థి పార్టీలను ప్రశ్నించేందుకు, విమర్శించేందుకు సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మీడియా ఆఫీస్ ని ప్రారంభించారు.
ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ప్రత్యేక ఛానల్ అంటూ ఉంటుంది. ఎన్నికల సమయంలో ఈ మీడియా ఛానల్స్ ఎంతో ప్రభావం చూపిస్తుంటాయి. కాగా జనసేన పార్టీకి ఇప్పటివరకు ఒక ప్రత్యేక ఛానల్ అంటూ లేదు. ఆ మధ్య జనసేన కోసం రామ్ చరణ్ ఒక మీడియా ఛానల్ ప్రారంభించబోతున్నారు అనే వార్తలు వినిపించినా, అవి రూమర్లు గానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఆ భాద్యతని నాగబాబు తీసుకున్నట్లు తెలుస్తుంది. ‘N మీడియా’ పేరిట నాగబాబు తన మీడియా ఛానల్ ని ప్రారంభించారు.
అయితే ప్రస్తుతానికి ఈ మీడియా ఛానల్ ని యూట్యూబ్ ఛానల్స్ తో రన్ చేయనున్నారట. సినిమా, హెల్త్, భక్తి వార్తలతో పాటు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూలతో ఈ మీడియాని రన్ చేయబోతున్నారు. భవిష్యత్తులో ఒక పొలిటికల్ న్యూస్ ఛానల్ గా ఈ N మీడియాని తీర్చిదిద్దడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. మరి ఈ ఐదేళ్లలో ఈ ఛానల్ ని డెవలప్ చేసి.. వచ్చే ఎన్నికల సమయానికి జనసేనకి సపోర్ట్ చేసే బలమైన మీడియా ఛానల్ గా మార్చుతారా లేదా చూడాలి.