Pawan Kalyan Birthday 2023 : తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది ప్రాణపద అభిమానులను సంపాదించుకున్న రియల్ హీరో

తన వ్యక్తిత్వమే తన ధైర్యం అంటూ చిత్రసీమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకొని , ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్

Published By: HashtagU Telugu Desk
Pawan Birthday 2023

Pawan Birthday 2023

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ఈ పేరులోనే పవర్..సిల్వర్ స్క్రీన్ ఫై పవన్ను అందుకోలేని శిఖరం. పవర్ స్టార్ అంటే ఓ సత్తా. పవన్ అంటే తిరుగులేని స్టామినా. తన వ్యక్తిత్వమే తన ధైర్యం అంటూ చిత్రసీమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకొని , ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్. రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని ఒక్కో మెట్టు ఎక్కుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ 52 వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా Hashtagu.in ప్రత్యేక కథనం మీకోసం.

(Pawan Kalyan) యాక్టర్ అవుతాడని అనుకోలేదు..కానీ అయ్యాడు..గొప్ప స్టార్ అవుతాడని భావించలేదు..కానీ అగ్ర హీరో అయ్యాడు. ఛాన్సుల కోసం పరుగులుపెట్టలేదు..మాకు ఓ ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆయన వెంటే నిర్మాతలు , దర్శకులు పరుగులుపెడుతున్నారు. పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేసిన చాలు అనుకునే నిర్మాతలు, దర్శకుడు ఎంతమందో..

పవన్ (Pawan Kalyan) పేరు చెబితే చాలు అభిమానుల్లో అలుపెరగని ఉత్సాహం.. అది తెరపైన అయినా.. తెర బయట అయినా సరే పవన్ కనిపిస్తే పూనకాలే.. హీరోకి అభిమానులు ఉండడం వేరు.. తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది ప్రాణపద అభిమానులను సంపాదించుకోవడం వేరు.. హీరోలందరిలో పవర్ స్టార్ వేరయా అన్నట్టుగా పవన్ రోజు రోజుకు మరింత దగ్గర అవుతున్నారు. మాములుగా చాలామంది హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ పవన్ కు మాత్రం భక్తులు ఉంటారు. సినిమాలతో పనిలేకుండా ఎల్లవేళలా అభిమానులు ఆయన వెంటే ఉంటారు. ఆయన అన్న చిరంజీవి తర్వాత అంత అభిమానాన్ని సొంతం చేసుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఎన్ని సినిమాల్లో నటించాడు? ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని ఫ్లాప్ అయ్యాయన్నది కాదు.. అభిమానులకు ఎంతలా చేరువయ్యారన్నదే ముఖ్యం. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్.

జనం కోసం పుట్టిన హీరో పవన్ కళ్యాణ్ (pawan Kalyan).. ఆయనకు జనంలో ఉండడం ఇష్టం.. జనం మెచ్చేలా.. జనాన్ని మెప్పించేలా బతకడం ఇష్టం.. జనం కోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధం.. అలాంటి జననాయకుడు వెండితెర ఇలవేల్పుగా.. రాజకీయ నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండే మనిషిగా.. ఒక పరిపూర్ణ సాహయకారిగా మన ముందు నిలబడ్డాడు.

పవన్ (Pawan Kalyan) సినీ చరిత్ర :

కళ్యాణ్ బాబు పేరును పవన్ కళ్యాణ్‌గా మార్చుకుని 1996లో ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాల్లో హీరోగా నిలదొక్కుకున్నారు.

1999 లో వచ్చిన ‘తొలిప్రేమ’ పవన్ కెరీర్లోనే ఓ మైలు రాయి చిత్రంగా నిలిచింది. ‘తొలిప్రేమ’ తర్వాత తమ్ముడు, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, వకీల్ సాబ్ పవన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీస్. ‘గబ్బర్ సింగ్’ సినిమాకు గాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ‘అత్తారింటికి దారేది’ వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్.. దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చి తగ్గేదేలే అన్నారు. కరోనా కారణంగా థియేటర్లకు జనం రాని సమయంలో కూడా వసూళ్ల వర్షం కురిసిందంటే దటీజ్ పవన్ కళ్యాణ్. ఇక వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ జోరు మామూలుగా లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

రాజకీయాల్లో పవన్ (Pawan Kalyan) ఎంట్రీ ..

సినిమాల్లో స్టార్ హీరోగా రాణిస్తున్నప్పటికీ ఆయనలో ఏదో అసంతృప్తి.. జనానికి ఏదో ఒకటి చేయాలని తపన పడేవాడు. ఆ కోరికతోనే రాజకీయాల్లోకి వచ్చాడు. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ స్థాపించాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయుడినని ప్రకటించిన నిస్వార్థ రాజకీయ నేత పవన్. జాతి సమైక్యత, సమగ్రతే ధ్యేయం అంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. అంతకుముందు అన్నయ్య చిరంజీవి ‘ప్రజారాజ్యం’ కూడా పనిచేశాడు. 2014 ఎన్నికల వేళ ఏపీలో పోటీచేయకుండా మోడీకి, చంద్రబాబుకు మద్దతు పలికి బీజేపీ-టీడీపీ కూటములు గెలుపులో కీలక పాత్రను పవన్ పోషించారు.

రాజకీయాల్లో ఉన్నత విలువలు ఆశయాలతో పవన్ ప్రస్థానం సాగింది. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం పవన్ చేశాడు. సమస్యలు పరిష్కరించని సొంత ప్రభుత్వాలు బీజేపీ, టీడీపీని కూడా నిలదీసిన చరిత్ర పవన్ సొంతం. ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ , అమరావతి రైతు సమస్యలు సహా ఎన్నో అన్యాయాలు, అక్రమాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజస్వామ్య పద్ధతిలో పవన్ పోరాడి పాలకుల్లో కదలిక తెచ్చాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీలతో విభేదించి ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు.

రాజకీయాల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా జనం మెచ్చినా నాయకుడిగా పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాడు. తాను సినిమాల్లోకి వెళ్లింది కేవలం ప్రజాసేవ కోసమేనని.. ఆ డబ్బులతో రాజకీయ పార్టీని నడపేందుకేనని అవినీతి రాజకీయ స్థాపనకు పవన్ గొప్ప ముందడుగు వేశాడు. ఆయన సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్న నమ్మిన సిద్ధాంతాల కోసం నీతి నిజాయితీలతో ముందుకెళుతున్నారు. సాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాడు. పైకి తెలిసినవి కొన్నే.. తెలియని ఎన్నో సాయాలు పవన్ చేశాడు..చేస్తూ వస్తున్నాడు.

పవన్ (Pawan Kalyan) వ్యక్తిగత జీవితంపై ఎన్నో విమర్శలు :

చిత్రసీమలో ఏ ఒక్కరితో ఒక్క మాట అనిపించుకుని పవన్..రాజకీయాల్లో మాత్రం ఊరు పేరు తెలియని వారితో కూడా మాటలు అనిపించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా విమర్శలు చేయలేని వారు.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మూడు పెళ్లిల్ల ప్రస్తావనతో ఆయన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

1997మేలో పవన్‌కు నందినితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ‘బద్రి’ సినిమాలో రేణుదేశాయ్ పరిచయమైంది. ఆ పరిచయం డేటింగ్ వరకూ వెళ్లిందంటారు. ఆ సమయంలో రేణుదేశాయ్ పవన్‌తో తనకు సంబంధం ఉందని, ఓ కొడుకు కూడా ఉన్నాడంటూ కోర్టులో కేసువేసింది. మొదటి భార్య నందినికి 2008 ఆగస్టులో విడాకులిచ్చి నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్‌ను పవన్ 2009, జనవరి 28న వివాహం చేసుకున్నారు. అకీరా, ఆద్య పిల్లలు. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురొసావాపై అభిమానంతో తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు పవన్. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యా భర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు చాలాసార్లు తెలిపింది.

2013 సెప్టెంబరు 30న రష్యా నటి అన్నా లెజ్‌నేవాతో పవన్‌కు మూడో వివాహం జరిగింది. హైదరాబాద్ ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ పెళ్లి జరిగింది. అన్నాకు ఓ కొడుకు.పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. పవన్ పెళ్లిళ్లపై ఎన్నో విమర్శలు చేస్తూనే ఉన్నారు. వీరు ఎన్ని విమర్శలు చేసిన ..పవన్ మాత్రం అవేమి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే..మరోపక్క రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. ఇక పవన్ పుట్టిన రోజు సందర్బంగా మరోసారి ఆయనకు బెస్ట్ విషెష్ ను అందజేస్తూ..పవన్ సినిమాల పరంగా..రాజకీయాల పరంగా రాణించాలని మా Hashtagu.in టీం కోరుకుంటున్నాం.

  Last Updated: 01 Sep 2023, 09:58 PM IST