Tollywood: సంక్రాంతి బరి నుంచి ఔట్.. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ కు నష్టమెంతంటే…?

సంక్రాంతి అంటేనే కొత్త సినిమాల సందడి షురూ. కానీ ఇప్పుడా సంతోషమే లేదు. కరోనా కాటు వల్ల పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. ఏమొచ్చినా ఒక్క బంగార్రాజే వచ్చాడు. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్.. ఇవన్నీ సైడైపోయాయి.

  • Written By:
  • Publish Date - January 16, 2022 / 08:00 AM IST

సంక్రాంతి అంటేనే కొత్త సినిమాల సందడి షురూ. కానీ ఇప్పుడా సంతోషమే లేదు. కరోనా కాటు వల్ల పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. ఏమొచ్చినా ఒక్క బంగార్రాజే వచ్చాడు. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్.. ఇవన్నీ సైడైపోయాయి. కానీ ఈ సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల వాటికి భారీగా వడ్డీల సమస్య తప్పదు. ఎందుకంటే నిర్మాణం కోసం ఇప్పటికే భారీగా అప్పులు చేసిన నిర్మాతలు.. బొమ్మ రెడీ అయినా సరే వేసుకోలేని పరిస్థితి నెలకొంది. అందుకే అది రిలీజ్ అయ్యేవరకు అసలుపై ఇంట్రస్ట్ కట్టుకోక తప్పదు.

ట్రిపుల్ ఆర్ సినిమా సంగతే చూస్తే.. దీనికి 300 కోట్ల రూపాయిలపైనే బడ్జెట్ ఉంటుంది. అందుకే ఒక్కరోజు ప్రొడక్షన్ కాస్ట్ సుమారు రూ.75 లక్షల అవుతాయని.. ఒక్కరోజు షూట్ తేడా వచ్చినా బాధగా ఉంటుందని ఆమధ్య రాజమౌళే చెప్పాడు. అన్నీ బాగుంటే.. ఈపాటికి ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్ల గురించి, రికార్డుల గురించి మాట్లాడుకునేవాళ్లు. కానీ ఇప్పుడా సీన్ లేకుండా పోయింది. దీంతో ఈ సినిమాకు తెచ్చిన పెట్టుబడిపై ఇప్పుడు కోట్లకొద్దీ వడ్డీ కట్టాల్సిన దుస్థితి తలెత్తింది.

30 రోజుల్లో షూటింగ్ ముగిసే చిన్న సినిమాల బడ్జెట్టే కోట్లలో ఉంటుంది. అలాంటిది వందల కోట్ల రూపాయిల పెట్టుబడి అంటే మాటలా. ఇక బాహుబలి తరువాత అంతటి ఖ్యాతి పొందిన రాధేశ్యామ్ సినిమా బడ్జెట్ కూడా 300 కోట్ల రూపాయిల పైమాటే. అందుకే దీనిపై మొదటినుంచి హైప్స్ బాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు సడన్ గా వాయిదా పడింది. సంక్రాంతి బరిలో ట్రిపుల్ ఆర్ తో ఢీకొట్టి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ అది నెరవేరలేదు. రాధేశ్యామ్ ఒకరోజు ప్రొడక్షన్ కాస్ట్ దాదాపు రూ.50 లక్షలు. ఇటలీలో షూటింగ్ జరపడం వల్ల బడ్జెట్ భారీగా పెరిగింది. ఇప్పటికే వడ్డీ కింద 50 కోట్ల రూపాయిలకు పైగానే అయ్యుంటుందని టాక్.

భీమ్లానాయక్ పేరు చెబితేనే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. అందుకే ఈ సంక్రాంతికి వచ్చేశాం ఇక తిరుగులేదులే అనుకున్నారు. అటు ట్రిపుల్ ఆర్, ఇటు రాధేశ్యామ్ ఉన్నా సరే.. బాక్సాఫీస్ తమదే అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఇది ముందే బరిలోంచి తప్పుకుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ కు ఆవేదన తప్పలేదు. ఈ సినిమా ఒకరోజు ప్రొడక్షన్ కాస్టే దాదాపు రూ.15 లక్షలు. దీనిని బట్టి సినిమా ఖర్చు ఎంతో ఊహించుకోవచ్చు.

భారీ సినిమాలకు పెట్టే పెట్టుబడిలో చాలా భాగాన్ని అప్పుగానే తెస్తారు. అంటే ఓ వంద కోట్ల రూపాయిలను నూటికి రెండు రూపాయిల చొప్పున అప్పుగా తెచ్చారనుకుంటే.. దానికి నెలకు కనీసం 2 కోట్ల రూపాయిలను వడ్డీగా చెల్లించాలి. సినిమా రిలీజ్ అయ్యి లాభాలు వచ్చేవరకు ఈ వడ్డీ బాధ తప్పదు. ఇప్పుడు ఏకంగా సినిమానే వాయిదా పడింది కనుక మళ్లీ అది రిలీజ్ అయ్యేవరకు వడ్డీ భారాన్ని నిర్మాత మోయాల్సిందే. ఇది లాభాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలకు టెన్షన్ పెరిగింది.