Pallavi Prashanth: బిగ్ బాస్ విజేతను ప్రకటించిన రోజు డిసెంబరు 17 ఆదివారం అన్నపూర్ణ స్టూడియో ముందు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. రన్నరప్ అమర్ దీప్ మరియు విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని భీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేయడమే కాకుండా అమర్ దీప్ ను వెంబడించి తరిమికొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులైన ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు.
బయట గొడవ జరుగుతోందని గ్రహించిన బిగ్ బాస్ నిర్వాహకులు స్థానిక పోలీసుల సహకారంతో పల్లవి ప్రశాంత్‌ను మరో మార్గం గుండా బయటకు పంపించారు. మళ్లీ ఇక్కడికి రావద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ పల్లవి ప్రశాంత్ పోలీసుల ఆదేశాలను, బిగ్ బాస్ నిర్వాహకుల సూచనలను పట్టించుకోకుండా ఓపెన్ టాప్ జీపులో సంఘటన ప్రదేశానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సీపీఐ నారాయణ తదితర నేతలు అల్లర్లను ఖండించారు.
అల్లర్లకు కారణమైన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తల్ని ప్రశాంత్ ఖండించారు. నేనెక్కడికి పారిపోలేదు, నేను మా ఇంట్లోనే ఉన్నానని ప్రాధేయపడ్డాడు. ఇదిగో మా ఇంట్లోనే ఉన్నా చూడుర్రి అంటూ ప్రశాంత్ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రశాంత్ పక్కనే కొంతమంది యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామంలో పల్లవి ప్రశాంత్ నివసిస్తాడు.
Also Read: Navy Jobs – 910 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో నేవీలో 910 జాబ్స్