Site icon HashtagU Telugu

Padmanabham : అంధుడి నుంచి దొంగతనం.. చివరి దశలో అప్పులతో పద్మనాభం దీనస్థితి..

Padmanabham was saddened in his last days with his childhood mistake

Padmanabham was saddened in his last days with his childhood mistake

సినీ పరిశ్రమలోని(Film Industry) వ్యక్తుల జీవితాలు స్క్రీన్ మీద కనిపించనంత రంగులతో ఉండదు. వారి జీవితాలు వెనుక కూడా ఎన్నో చీకటి రోజులు, బాధాకరమైన పరిస్థితులు ఉంటాయి. ఒకప్పుడు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన వారు తరువాత రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించి పేదరికంతో లోకం విడిచిన వారు ఉంటారు. వారిలో ఒకరే హాస్య నటుడు ‘పద్మనాభం'(Padmanabham). నటుడిగా నవ్వించడమే కాకుండా నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు కూడా నిర్మించి మెప్పించారు.

కాగా పద్మనాభం తన చిన్నతనంలో చేసిన ఒక తప్పు తనని ఎప్పుడు వెంటాడుతూ ఉండేదని చెప్పుకొచ్చేవారు. చిన్నప్పుడు ఒక అంధుడి కంచంలో రాయి వేసి దానిలో ఉన్న చిల్లర డబ్బులని దొంగలించారట. అయితే ఒక వయసొచ్చాక ఆ తప్పు తెలిసి ఎప్పుడూ బాధ పడేవారట. దాని పశ్చాతాపం కోసం కూడా అనేక పనులు కూడా చేశారు. పద్మనాభం నిర్మించిన ‘జాతకరత్న మిడతం భొట్లు’ సినిమాలో అంధుడుపై ఒక సన్నివేశం ఉంది. దాని కోసం నిజమైన అంధుడిని తీసుకొచ్చి చేయించి, అతనికి కొంతడబ్బు ఇచ్చి పంపించారట.

అలాగే ‘లిటిల్ ఫ్లవర్’ అనే బ్లైండ్ అండ్ డెఫ్ సంస్థకు.. తను చేసిన తప్పుకి పరిహారం కోసం కొంత విరాళం కూడా ఇచ్చేవారు. అయినా సరే ఆయనను ఆ బాధ వెంటాడుతూనే ఉందని పద్మనాభం బాధ పడేవారు. 1975లో ‘సినిమా వైభవం’ అనే మూవీ కోసం ఒక వ్యక్తి దగ్గర రూ.60 వేలు అప్పుచేశారు. ఆ అప్పుకి హామీగా తన వద్ద ఉన్న.. పొట్టి ప్లీడరు, శ్రీరామకథ, దేవత, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాల నెగటివ్‌లను తాకట్టుగా పెట్టారు.

ఆరు నెలల్లో పద్మనాభం అప్పు తీర్చకుంటే ఆ సినిమా హక్కులన్నీ ఆ వ్యక్తికి సొంతమవుతాయనేది అగ్రిమెంటు. ఆరు నెలల్లో పద్మనాభం అప్పు తీర్చలేకపోవడంతో ఆ హక్కులను ఆ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ళకు పద్మనాభం ఆ అప్పు తీర్చేశారు. కానీ ఆ వ్యక్తి ఆ హక్కులను వెనక్కి ఇవ్వలేదు. ఇక అది కోర్టుకి వెళ్లి పద్మనాభం చాలా ఇబ్బందులు పడ్డారు.

అయితే చివరికి అప్పు ఇచ్చిన వ్యక్తి మరణించడంతో.. అతడి కుటుంబసభ్యులు ఒక లక్ష రూపాయలు తీసుకొని పద్మనాభానికి నెగెటివ్‌లు ఇచ్చారు. పద్మనాభం అప్పడికే చాలా దీనస్థితికి వచ్చేశారు. సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. సంపాదన లేక చీకటి రోజులను చూశారు. అతను చిన్నప్పుడు చేసిన తప్పే తనను ఈ స్థితికి తీసుకొచ్చిందని చివరి రోజుల్లో బాధపడ్డారట.

 

Also Read : Krishnam Vande Jagadgurum : మూడు కథలను కలిపి ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ తీసిన క్రిష్..