Chiranjeevi : ఎంజీఆర్‌కి భారతరత్న ఇచ్చినప్పుడు.. ఎన్టీఆర్‌కి ఇవ్వాలి.. చిరు కామెంట్స్

ఎంజీఆర్‌కి భారతరత్న ఇచ్చినప్పుడు ఎన్టీఆర్‌కి ఇవ్వడం కూడా సముచితమే. చిరంజీవి వైరల్ కామెంట్స్..

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 05:16 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. నిన్న (మే 9) ఢిల్లీలోని రాజభవనంలో ఈ పురస్కార వేడుక ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. ఇక ఆ అవార్డు అందుకున్న తరువాత నేడు చిరంజీవి హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన చిరంజీవికి మీడియా ప్రతినిధులు తమ ప్రశ్నలతో ఎదురయ్యారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ భారతరత్న అవార్డు గురించి కూడా ప్రశ్నించారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు జాతి ఖ్యాతిని ఎన్టీఆర్ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసారు. అలాంటి వ్యక్తికి భారతదేశపు అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న ఇవ్వాలని ఎప్పటినుంచో తెలుగు ప్రజలు కోరుతున్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని పై స్పందించకుండానే వస్తుంది. ఇక పద్మ విభూషణ్ అందుకొని వచ్చిన చిరంజీవిని ఇలా ప్రశ్నించారు.. “ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలని ఎప్పటినుంచో తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. రేపు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వస్తే దాని ద్వారా ఎన్టీఆర్ కి భారతరత్న కోసం ఫైట్ చేస్తారా..?” అంటూ అడిగారు.

“ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలని నేను కోరుకుంటున్నాను. అటు తమిళనాడులో ఎంజీఆర్ గారికి ఇచ్చిన ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ గారికి ఇవ్వడం కూడా సముచితమే. అందుకోసం రానున్న గవర్నమెంట్ పోరాడితే సంతోషమే” అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. కాగా టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ కి భారతరత్న కోసం చాలాసార్లు కేంద్రాన్ని ప్రశ్నించారు. మరి ఈసారి బీజేపీతో కలిసి ఏపీ ఎన్నికల్లో ఫైట్ చేస్తున్నారు. రేపు గెలిచిన తరువాత బీజేపీని భారతరత్న గురించి అడుగుతుందా లేదా చూడాలి.