Site icon HashtagU Telugu

Operation Sindoor Movie : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పోస్టర్.. సారీ చెప్పిన దర్శకుడు.. ఎందుకు ?

Operation Sindoor Movie director Uttam Maheshwari Operation Sindoor

Operation Sindoor Movie : ‘‘ఆపరేషన్‌ సిందూర్‌ మూవీ తీయబోతున్నా.. ఇదిగో పోస్టర్’’ అంటూ ప్రకటన విడుదల చేసిన మూవీ డైరెక్టర్ ఉత్తమ్‌ మహేశ్వరీ‌పై విమర్శలు వెల్లువెత్తాయి.  ‘‘దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఆటలాడొద్దు’’ అంటూ ఆయనకు నెటిజన్లు హితవు పలికారు. ‘‘సినిమాలు తీసేవాళ్లు సమయం, సందర్భం లేకుండా స్పందించొద్దు. ఇది సినిమాలు తీసే టైం కాదు. వ్యాపారం, ప్రచారం చేసుకునే టైం అంతకంటే కాదు. దేశానికి అండగా నిలవాల్సిన టైం’’ అంటూ కొందరు నెటిజన్లకు డైరెక్టర్ ఉత్తమ్‌ మహేశ్వరీ‌కి సూచన చేశారు. దీంతో తాను చేసిన తప్పును గ్రహించి నాలుక కరుచుకున్న డైరెక్టర్ ఉత్తమ్ వెంటనే క్షమాపణ చెప్పారు. ‘‘ఎదుటివ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. డబ్బు లేదా ఫేమ్‌ కోసం నేను ఇలాంటి పని చేయలేదు’’ అని ఆయన తేల్చి చెప్పారు.

Also Read :Pakistan Attack: 26 ప్రదేశాల్లోకి పాక్ డ్రోన్లు.. నాలుగు ఎయిర్‌బేస్‌లపై దాడి

ఇది సినిమా కాదు.. దేశ ప్రజల ఎమోషన్

‘‘ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో సినిమా తీస్తున్నట్లుగా ఇప్పుడే ప్రకటన విడుదల చేసినందుకు క్షమాపణలు కోరుతున్నాను. మన వీర సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాన్ని, నాయకత్వాన్ని ఒక పవర్‌ఫుల్‌ కథగా వెండితెరపైకి చూపించాలనేది మాత్రమే నా తాపత్రయం. దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తూ ఈ సినిమా తీయాలని అనుకున్నాను. ప్రస్తుత పరిస్థితుల నడుమ నా ప్రకటన కొందరికి అసౌకర్యం కలిగించి ఉండొచ్చు. అందుకు క్షమాపణలు చెబుతున్నా. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు దేశ ప్రజల ఎమోషన్‌’’ అని డైరెక్టర్ ఉత్తమ్(Operation Sindoor Movie) చెప్పారు.

Also Read :Operation Kagar : ‘ఆపరేషన్ కగార్‌’‌పై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఎఫెక్ట్‌ .. కీలక ఆదేశాలు

సినిమా టైటిల్ కోసం భారీ పోటీ 

నిక్కీవిక్కీ భగ్నానీ ఫిల్మ్స్‌ పతాకంపై ఉత్తమ్‌ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో శుక్రవారం రాత్రి సినిమాను ప్రకటించారు. పహల్గాం ఘటన, మన సైనికుల ధైర్య సాహసాలను తెలియజేసేలా ఈ సినిమా ఉంటుందని వెల్లడించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ ఆర్మీ ఆపరేషన్ మొదలుపెట్టిందని మే 7న ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆ టైటిల్‌ను రిజర్వ్ చేసుకునేందుకు దాదాపు 15కుపైగా సినీ నిర్మాణ సంస్థలు దరఖాస్తులు సమర్పించాయి.  ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌‌కు ఈమేరకు దరఖాస్తులు  సమర్పించిన సంస్థల జాబితాలో జీ స్టూడియోస్, టీ-సిరీస్‌ వంటి ప్రముఖ సినీ నిర్మాణసంస్థలు కూడా ఉన్నాయి.