Site icon HashtagU Telugu

Chiranjeevi : ఇండియాలో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరో చిరంజీవి..

Only Megastar Chiranjeevi Creates This Record with Industry Hit Movies

Only Megastar Chiranjeevi Creates This Record with Industry Hit Movies

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రికార్డులు గురించి చెప్పుకుంటే వెళ్తే ఒక పుస్తకమే అవుతుంది. ఒకదానిని మించిన రికార్డు మరొకటి ఉంటుంది. తన తోటి హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వేంకటేష్ గట్టి పోటీ ఇస్తున్న సమయంలో కూడా చిరంజీవి ఓ అరుదైన రికార్డుని సృష్టించారు. ఆ రికార్డు కేవలం ఒక రోజు, నెల, సంవత్సరానికి సంబంధించింది కాదు. ఆరేళ్లకు సంబంధించిన ఓ అద్భుతమైన రికార్డు. ఇంతకీ చిరంజీవి సృష్టించిన ఆ అరుదైన రికార్డు ఏంటి..?

చిరంజీవి సినిమాల్లో చాలా ఇండస్ట్రీ హిట్సే ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ హిట్స్ తోనే చిరంజీవి ఈ అరుదైన రికార్డుని క్రియేట్ చేసారు. 1987లో ‘పసివాడి ప్రాణం’ సినిమాతో మొదలైంది ఈ రికార్డు. ‘పసివాడి ప్రాణం’ సినిమా ఎమోషన్ తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్టుని సొంతం చేసుకుంది. ఆ తరువాత సంవత్సరం 1988లో ఈ రికార్డుని ముందుకు తీసుకు వెళ్తూ.. ‘యముడికి మొగుడు’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

1989లో ‘అత్తకి యముడు అమ్మాయికి మొగుడు’ సినిమాతో కూడా ఇండస్ట్రీ హిట్టుని అందుకొని రికార్డు పరంపరని కొనసాగిస్తూ ముందుకు కదిలారు. 1990లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’తో టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ ఇండస్ట్రీ హిట్టుని అందుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ సమయంలో భారీ తుఫాను వచ్చింది. ఆ తుఫాను కూడా లెక్కచేయకుండా చిరంజీవి ఫ్యాన్స్ బాక్స్ ఆఫీస్ సునామీని సృష్టించారు.

ఆ తరువాత 1991లో ‘గ్యాంగ్ లీడర్’, 1992లో ‘ఘరానా మొగుడు’ సినిమాలతో కూడా ఇండస్ట్రీ హిట్స్ ని నమోదు చేసారు. ఇలా వరసగా ఆరేళ్లలో ఆరుసార్లు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ఏకైక ఇండియన్ హీరోగా చిరంజీవి నిలిచారు. రజినీకాంత్ కి కూడా ఇలాంటి రికార్డు ఉంది. కానీ ఆయన సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి గాని, ఒక సంవత్సరం తరువాత ఒకటి రిలీజ్ అవ్వలేదు. అందుకనే ఈ అరుదైన రికార్డు కేవలం చిరంజీవి పేరు మీదనే ఉంది.

 

Also Read : Kamal Haasan: ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 సినిమా కూడా అయిపోయిందా : కమల్ హాసన్